ఇది డ‌ర్టీగేమ్ : లాలూ

ఇది డ‌ర్టీగేమ్ : లాలూ

దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో రాంచీ సీబీఐ కోర్టు  ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. జనవరి 3వ తేదీన తీర్పును వెలువరించనుంది. న్యాయస్థానం లాలును దోషిగా ప్రకటించడంతో పోలీసులు ఆయనను రాంచీలోని బిర్సా ముందా సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పుపై లాలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బీజేపీ డర్టీగేమ్ ఆడుతుందని అన్నారు.

ఈ  తీర్పు ఏకపక్షంగా ఉందని లాలూ అస‌హనం వ్య‌క్తం చేశారు. కోర్టు తీర్పు రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని తెలిపారు. సాక్ష్యాలను తారుమారుచేశారని ఆరోపించారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించారు. న్యాయం కోసం పోరాటం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. `ఉన్నత వర్గాలు, శక్తివంతమైన మనుషులు సమాజాన్ని పాలకులు, పాలితులుగా విభజిస్తారు. ఈ క్రమంలో కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఆ విధానాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారు తప్పకుండా శిక్షార్హులు అవుతారు. నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. కానీ చివరకు నిజమే గెలుస్తుంది` అని అన్నారు.

కాగా లాలు జైలుకు వెళ్లడం ఇది తొమ్మిదవసారి. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో లాలు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లివస్తున్నారు. ఒక్క దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లోనే ఐదుసార్లు జైలుకు వెళ్లారు. రాంచీలోని బిర్సా ముందా సెంట్రల్ జైలుకు వెళ్లడం ఈ 69 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడికి ఇది మూడోసారి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు