రాజ్య‌స‌భ‌లో కాదు...ఫేస్ బుక్ లైవ్ లో ప్ర‌సంగించాడు!

రాజ్య‌స‌భ‌లో కాదు...ఫేస్ బుక్ లైవ్ లో ప్ర‌సంగించాడు!

రాజ్యసభలో తొలిసారి మాట్లాడేందుకు సిద్ధ‌మైన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కు కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య చేదు అనుభ‌వం ఎందురైన సంగ‌తి తెలిసిందే. క్రీడా హక్కు, దేశంలో క్రీడల భవిష్యత్తుపై స్వల్పకాలిక వ్యవధి చర్చను స‌చ‌న్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ సభలో గందరగోళ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అది సాధ్యంకాలేదు. శుక్ర‌వారం స‌భలో కూడా దాదాపు  అవే పరిస్థితులు ఏర్ప‌డ‌డం, స‌భ బుధ‌వారానికి వాయిదా ప‌డ‌డం తెలిసిందే. దీంతో, బుధ‌వారం స‌చిన్ ఆ అంశంపై ప్ర‌సంగిస్తారేమో అని అంతా భావిస్తున్నారు. అయితే, బుధ‌వారం కూడా ప‌రిస్థితిలో పెద్ద మార్పు రాదేమో అని స‌చిన్ భావించారో ....లేక ఆ రోజు స‌భ‌కు హాజ‌రు కావ‌డం కుద‌ర‌ద‌నో.....కార‌ణాలేమైనప్ప‌టికీ స‌చిన్ తాను స‌భ‌లో ప్ర‌సంగించ‌ద‌లుచుకున్న విష‌యాన్ని ఫేస్ బుక్ లైవ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ క్రికెట్ దేవుడు లైవ్ లోకి వ‌చ్చి క్రీడ‌ల ప్రాధాన్యాన్ని తెలియ‌జేయ‌డంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో చాలామంది సెల‌బ్రిటీలు తాము చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాల‌ను ఫేస్ బుక్ లైవ్ సెష‌న్ ల ద్వారా నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాను విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటున్నారు. తాజాగా, స‌చిన్ కూడా అనివార్య ప‌రిస్థితుల్లో అదే బాట ప‌ట్టాడు. రాజ్య‌స‌భ‌లో మాట్లాడాల్సిన విష‌యాన్ని ఫేస్ బుక్ లైవ్ లో చెప్పేశాడు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, క్రీడలను ప్రేమించే దేశంగా కాకుండా క్రీడలు ఆడే దేశంగా భారత్‌ మారాలని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ పిలుపునిచ్చారు. క్రీడలతో ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని తెలిపారు. త‌న‌ను ఏదో శ‌క్తి ఇంత దూరం తీసుకువ‌చ్చింద‌ని, అది త‌న‌కు చాలా ఆశ్చర్యం కలిగించే విషయమ‌ని స‌చిన్ చెప్పారు. చిన్నప్పుడు తాను క్రికెట్‌లో వేసిన బుడిబుడి అడుగులే ఈ అద్భుతమైన జ్ఞాపకాలనిచ్చాయేమో అని అన్నారు. బాల్యం నుంచి క్రికెట్‌ మాత్రమే త‌న‌ జీవితమని విశ్వసించాన‌ని, త‌న తండ్రి  ప్రోత్సాహం మ‌రువ‌లేన‌ని చెప్పారు. ఆడే స్వేచ్ఛను త‌న తండ్రి బ‌హుమ‌తిగా ఇచ్చార‌ని, దాన్నొక హక్కుగా పొందాన‌ని, అది త‌న‌కెంతో గర్వకారణమ‌ని స‌చిన్ అన్నారు.

దేశాన్ని పీడిస్తున్న సమస్యలపై దృష్టిపెట్టాల‌ని, ఆర్థికాభివృద్ధి, పేదరికం, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి అనేక విష‌యాల‌పై మాట్లాడాల్సి ఉంద‌న్నారు. కానీ, ఒక క్రీడాకారుడిగా....క్రీడలు, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడతాన‌న్నారు. ఆ అంశాలు దేశ ఆర్థికవ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతాయో చెప్పారు. ఆరోగ్యవంత‌మైన‌, ఫిట్‌నెస్ తో కూడిన భారతాన్ని చూడాలన్నదే త‌న క‌ల అని, 2020 నాటికి యువ భారత్ గా మార‌బోతున్నామ‌ని అన్నారు. అయితే, యువకులంతా ఫిట్‌నెస్ గా లేరని, మనం డయాబెటిక్‌ క్యాపిటల్ గా మారుతున్నామ‌ని అన్నారు.  దేశంలో 75 మిలియన్ల మంది డయాబెటిక్ బారిన ప‌డ్డార‌ని, అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంద‌ని చెప్పారు.  క్రీడ‌లు, ఆరోగ్యం, ఫిట్ నెస్ పై స‌చిన్ ప్ర‌సంగం యువ‌త‌తో పాటు అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి, ఫేస్ బుక్ లైవ్ లోనే తాను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాల‌ను చెప్పిన స‌చిన్ ....రాజ్య‌స‌భ‌లో మ‌ళ్లీ ఇవే విష‌యాల‌ను ప్ర‌సంగిస్తారా? లేక ఇంత‌టితో స‌రిపెట్టేస్తారా అన్న‌ది తేలాల్సి ఉంది.