ఆ ప‌ని చేయ‌కపోతే చిరంజీవే కింగయ్యేవాడా?

ఆ ప‌ని చేయ‌కపోతే చిరంజీవే కింగయ్యేవాడా?

ప్రతి రాష్ట్రంలోనూ పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షంతో పాటు కనీసం మరో పార్టీ ఏదైనా ఒకటి పోటీ ఇస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ... బీహార్‌కు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు జేడీయూ, ఆర్జేడీ మెయిన్ ప్లేయర్లు... గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు బరిలో నిలిచాయి. చిన్న రాష్ర్టమైనా కూడా హిమాచల్‌లోనూ కమ్యూనిస్టు పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.    అంతకుముందు అస్సాంలోనూ ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఇలా ప్రతిచోటా  ప్రజలకు కొన్ని ఆప్షన్లంటూ ఉన్నాయి. కానీ... ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి మాత్రం ప్రజలకు అలాంటి అవకాశం లేదు. రానున్న ఎన్నికలను చూసుకుంటే ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యే పోటీ. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నా అది ఏమాత్రం ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. పైగా జనసేన టీడీపీతోనే కలిసి పోటీ చేసే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి ఏపీలో ఇంకా మాట్లాడుకునే టైం రాలేదు. సో... ఆ పార్టీ లెక్కలోనే లేదు. బీజేపీ ఎలాగూ టీడీపీకి మిత్రపక్షమే. పొత్తులు తెగిపోతాయని అప్పుడే అనుకోలేం.

    సో.... ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ అన్నది కన్ఫర్మ్. ఇందులో కొత్త విషయం ఏమీ లేకపోయినా 2009 నాటి ఎన్నికల పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవన్నది ఆసక్తికరంగా అనిపిస్తుంది. 2009 ఎన్నికలప్పుడు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి గట్టి ప్రయత్నమే చేశారు. అయితే.. రాజకీయాలకు కొత్త కావడం.. పార్టీలో టిక్కెట్ల కేటాయింపులు వంటి విషయాల్లో జరిగిన పొరపాట్ల ఫలితంగా అద్భుతాలేమీ సాధించలేకపోయింది. అయితే... 2014 నాటికి ప్రజారాజ్యం అద్భుతాలు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. దాంతో 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం లేకుండా పోయింది.

    ఒకవేళ ప్రజారాజ్యం పార్టీయే కనుక ఇప్పుడుంటే వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఉండేది. చంద్రబాబు వైఫల్యాలు.. ఆ వైఫల్యాలను తనకు అనుకూలంగా మలచుకోలేకపోతున్న జగన్‌లకు ప్రత్యామ్నాయంగా చిరంజీవిని ప్రజలు గుర్తించే ఛాన్సుండేది. త్రిముఖ పోరులో కింగ్ కావడమో కింగ్ మేకర్ కావడమో జరిగుండేది. కానీ... చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు మూడో పార్టీయే కనిపించక టీడీపీ, వైసీపీలకు కాదంటే నోటా నొక్కాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఒక వేళ చిరంజీవి ఇపుడు క‌నుక ఉండి ఉంటే... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మెజారిటీ కులంగా మారిన కాపుల అండ‌... టీడీపీ - వైసీపీల మీద విసుగు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భ క‌లిసొచ్చి 30-40 సీట్లు సాధించినా అధికారాన్ని డిసైడ్ చేసే పార్టీగా ఉండేది. దీంతో గ‌ట్టిగా డిమాండ్ చేస్తే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్తితుల్లో చిరంజీవికి కేవ‌లం 30 సీట్ల‌తోనే సీఎం ప‌ద‌వి ద‌క్కినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ రాజ‌కీయ అనుభ‌వ లేమి, ఇత‌ర పార్టీల సూటిపోటి మాట‌లు త‌ట్టుకోలేని చిరంజీవి వాట‌న్నింటినీ వ‌దిలించుకున్నాడు. దీన్ని బ‌ట్టి చిరంజీవి సూప‌ర్ ఛాన్స్ మిస్స‌య్యాడు అనిపిస్తోంది.