చిరుకు ఛెళ్లుమ‌నిపించేలా చేసిన మాట అన్నాడ‌ట‌

 చిరుకు ఛెళ్లుమ‌నిపించేలా చేసిన మాట అన్నాడ‌ట‌

మెగాస్టార్ చిరంజీవి ఏమిటి.. ఆయ‌న చెంప ఛెళ్లుమ‌నేలా మాట అన‌ట‌మా?  సౌమ్యుడు.. నోటి వెంట సాత్వికంగా మాట్లాడ‌ట‌మే కానీ.. త‌న‌ను దెబ్బ తీసిన వారిపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ని చిరుకు అంత క‌ష్టం ఎందుకు వ‌చ్చింది?  చిరుకు ఛెళ్లుమ‌నే మాట ఎందుకు అన్నారు? అస‌లేం జ‌రిగింది? అన్న‌ది చూస్తే.. ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పింది మెగాస్టారే కావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సినీ తార‌లు భారీగా త‌ర‌లివ‌చ్చి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌టం తెలిసిందే. ముందు ప్ర‌చురించిన ప్రోగ్రామ్ షీట్ లో ఎక్క‌డా కూడా ఇంత భారీ స్థాయిలో సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్న విష‌యం లేదు.

కానీ.. ఉన్న‌ట్లుండి వారు రావ‌టం వెనుక ఉన్న విష‌యాన్ని కూడా మెగాస్టార్ చెప్పేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులంద‌రికి పేరు పేరునా శాలువాతో స‌త్క‌రించి..వారిచేత మాట్లాడించారు. ఈ సంద‌ర్భంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించార‌న్నారు.

ఈ సంద‌ర్భంగా తాను కేటీఆర్‌కు వ‌చ్చిన అవార్డు గురించి ప్ర‌స్తావిస్తూ.. పొగుడుతూ ఇంగ్లిషులో మాట్లాడాన‌న్నారు. వెంట‌నే క‌ల్పించుకున్న కేటీఆర్‌.. చిరంజీవిగారూ.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు క‌దా.. తెలుగులో మాట్లాడుకుందామ‌న్నార‌ని.. త‌న‌ను ఎవ‌రో ఛెళ్లున కొట్టిన‌ట్లుగా అనిపించింద‌న్నారు. అవును.. నిజ‌మే క‌దా.. ఇద్ద‌రు తెలుగువాళ్లం మాట్లాడుకునేట‌ప్పుడు తెలుగులో మాట్లాడుకోకుండా ఇంగ్లిషేమిటి అనుకున్నాన‌ని చెప్పారు. ఇక్క‌డ కేటీఆర్ అన‌టం త‌ర్వాత‌.. ఆ విష‌యాన్ని ఎలాంటి ఇజం లేకుండా ఓపెన్ గా చెప్పుకున్న చిరంజీవి స‌హృద‌య‌త‌ను ప్ర‌శంసించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు