కాంగ్రెస్‌కు మిగిలింది ఆ నాలుగే..!

కాంగ్రెస్‌కు మిగిలింది ఆ నాలుగే..!

కాంగ్రెస్ విముక్త భార‌త్ అన్న‌ది మోడీ నినాదం. కాంగ్రెస్ ర‌హిత భార‌త్‌ను త‌యారు చేయ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా మోడీ ప‌దే ప‌దే చెబుతుంటారు. ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు ఇప్పుడు అందుకు త‌గ్గ‌ట్లే మారుతున్నాయి. దేశంలో ఒక‌ప్పుడు మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాల‌న ఉండేది. మోడీ ఎంట్రీ అనంత‌రం ఒక్కో రాష్ట్రం చొప్పున చేజార‌టం మొద‌లైంది.

తాజాగా జ‌రిగిన రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ఓడిపోయింది. గుజ‌రాత్ లో 22 ఏళ్ల నాన్ స్టాప్ అధికారం త‌ర్వాత కూడా బీజేపీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. రెండు ముఖ్య‌మైన రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెప‌రెప‌లాడింది.  

దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉండ‌గా.. వీటిల్లో బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉండ‌గా.. మ‌రో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కేవ‌లం నాలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైంది. వీటిల్లో రెండు రాష్ట్రాలు బుల్లి రాష్ట్రాలైన మిజోరం.. మేఘాల‌య‌. మిగిలిన రెండింటిలో ఒక‌టి క‌ర్ణాట‌క అయితే.. మ‌రొక‌టి పంజాబ్‌.  త్వ‌ర‌లో క‌ర్ణాట‌క‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. రానున్న ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క సైతం చేజార‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఒక‌ప్పుడు మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ రోజు ఇంత దారుణ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టానికి కార‌ణం వ్యూహ‌చ‌తుర‌త లోపంగా చెప్పాలి. అందుకు గుజ‌రాత్ రాష్ట్ర ప‌లితాలే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. గెలుపు వాకిట వ‌ర‌కూ రాగ‌లిగిన కాంగ్రెస్‌.. మ‌రింత‌గా శ్ర‌మించి ఉంటే సంచ‌ల‌న విజ‌యం న‌మోదు కావ‌టంతో పాటు.. మోడీకి భారీ షాక్ త‌గిలేది. ఆయ‌న ఆత్మ‌విశ్వాసం మీద దెబ్బ కొట్టే అద్భుత అవ‌కాశాన్ని కాంగ్రెస్ కోల్పోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  పైకి సంబ‌రాలు చేసుకుంటున్న‌ప్ప‌టికీ.. మోడీ.. అమిత్ షాల‌కు గుజ‌రాత్ లో త‌మ‌కు ల‌భించిన విజ‌యం ఎలాంటిదో తెలియ‌టం ఖాయం. సొంత అడ్డాలో ప్ర‌జ‌లు త‌మ పాల‌న‌కు ఎంత‌గా విసిగిపోయార‌న్న విష‌యంపై మ‌రింత దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. బొటాబొటి మెజార్టీ వ‌చ్చిన‌ప్ప‌టికీ గుజ‌రాత్ ఫ‌లితం త‌న‌కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింద‌న్న మోడీ మాట‌లోని అర్థాన్ని అర్థం చేసుకుంటే గుజ‌రాత్ మీద మోడీ ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నారో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు