ఓడినా కాంగ్రెస్‌లో ఉత్సాహం.. గెలిచినా బీజేపీలో నీర‌సం

ఓడినా కాంగ్రెస్‌లో ఉత్సాహం.. గెలిచినా బీజేపీలో నీర‌సం

రాజ‌కీయాలు చిత్రంగా ఉంటాయి. ఫ‌లితాల‌కు త‌గ్గ‌ట్లుగా ప‌రిణామాలు మామూలే అయినా.. పాలిటిక్స్ లో మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. తాజాగా వెలువ‌డిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల ముచ్చ‌ట చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. త‌న రెండు ద‌శాబ్దాలకు పైగా తిరుగులేని పాల‌న అనంత‌రం కూడా మ‌రో ఐదేళ్ల పాటు గుజ‌రాత్ కోట మీద కాషాయ జెండా ఎగిరేలా గుజ‌రాతీలు తీర్పు ఇచ్చేశారు.

గెలిచిన‌ప్పుడు ఉండే ఉత్సాహం క‌మ‌ల‌నాథుల్లో క‌నిపించ‌క‌పోవ‌టం ఒక విశేషంగా చెప్పాలి. అదే స‌మ‌యంలో ఓడిపోయిన‌ప్పుడు డీలా ప‌డే దానికి భిన్నంగా కాంగ్రెస్ లో ఉత్సాహం ఉర‌క‌లేస్తున్న ప‌రిస్థితి. గుజ‌రాత్ లో అనుకున్న దాని కంటే త‌క్కువ సీట్లు రావ‌టం క‌మ‌ల‌నాథుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తుంటే.. అందుకు భిన్నంగా  తాము వేసుకున్న లెక్క‌ల‌కు మించి ఫ‌లితాలు రావ‌టం కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహానికి గురి చేస్తోంది.

గుజ‌రాత్ లో బీజేపీ గెలుపు ప‌క్కా కావ‌టంతోపాటు.. త‌క్కువ‌లో త‌క్కువ వేసుకున్నా 120 స్థానాల‌కు త‌గ్గ‌కుండా బీజేపీ గెలుపు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. అయితే.. వాస్త‌వంలో మాత్రం 105 స్థానాల‌కే ప‌రిమితం కావ‌టం బీజేపీ వ‌ర్గాల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. అదే స‌మ‌యంలో అంచ‌నా వేసుకున్న దానికంటే మిన్న‌గా 74 స్థానాల్లో గెలుపు క‌న్ఫ‌ర్మ్ అన్న‌ట్లుగా కావ‌టంతో కాంగ్రెస్ పార్టీలో స‌రికొత్త ఉత్సాహాన్నిస్తోంది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ దూసుకెళ‌తార‌ని.. ఆయ‌న‌కు తిరుగులేద‌న్న ఆత్మ‌విశ్వాస‌పు మాట‌లు క‌మ‌ల‌నాథుల నోటి నుంచి రాకుండా గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు అడ్డుకున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.ఇదే బీజేపీ నేత‌ల నిరాశ‌కు కార‌ణంగా చెప్పాలి. బీజేపీకి కంచుకోట లాంటి గుజ‌రాత్ లో.. అందునా ప్ర‌ధాని మోడీ లాంటి నేత సొంత అడ్డాలోనే అధికార పార్టీకి ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

సాధారణంగా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది.  ఇందుకు భిన్నంగా గుజ‌రాత్ గెలుపు మాత్రం బీజేపీకి నీర‌సాన్ని తీసుకొస్తే.. ఓట‌మి కాంగ్రెస్‌కు స‌మ‌రోత్సాహాన్ని రెట్టింపు అయ్యేలా చేసింది.  ఓడినా ఫ‌ర్లేదు.. భ‌విష్య‌త్ మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన వైనం రాహుల్ అండ్ కోకు ప‌ట్టుద‌ల మ‌రింత పెంచుతుంద‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు