పెద్ద ఎన్టీఆర్ మాట‌- నా వీపు ఎవ‌రు తోముతారు బ్ర‌ద‌ర్ ?

పెద్ద ఎన్టీఆర్ మాట‌- నా వీపు ఎవ‌రు తోముతారు బ్ర‌ద‌ర్ ?

నంద‌మూరి తార‌క రామారావు సినీ జీవితంలో ఎత్తులు ఎక్కువ ప‌ల్లాలు త‌క్కువ‌. కానీ రాజ‌కీయ జీవితంలో ఎత్తులు ప‌ల్లాలు స‌మానంగా ఉన్నాయి. ఆయ‌న అజ‌రామ‌ర‌మైన కీర్తిని క‌లిగి ఉండొచ్చు గాని... కానీ ఆయ‌న కూడా ఒక మ‌నిషే క‌దా. వృద్దాప్యం మీద ప‌డేస‌రికి ఆయ‌న జీవితంలో కూడా సామాన్య మాన‌వుడి భావోద్వేగాలు వెంటాడాయి. ఎన్టీఆర్‌కు 64 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌పుడు అంటే 1987లో లక్ష్మీపార్వ‌తి ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను రాసే క్ర‌మంలో ఎన్టీఆర్ ఇంట్లోనే ఉండ‌వ‌ల‌సి వ‌చ్చింది. అప్ప‌టికి ఇంకా ఎన్టీఆర్ అధికారంలోనే ఉన్నారు. 1989లో ఎన్టీఆర్ కాంగ్రెస్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అప్ప‌టికే జీవిత చ‌రిత్ర రాసే పేరిట ఎన్టీఆర్‌తో ఆమెకు ఉన్న చ‌నువు ఎక్కువ స‌మ‌యం దొర‌క‌డంతో ఇంకా పెరిగింది. ఈ క్ర‌మంలో ఆమె ఎన్టీఆర్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యింది. 1993లో అది వారి పెళ్లికి దారితీసింది.

అయితే, 1993కి ముందు కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు యార్ల‌గ‌డ్డ లక్ష్మీ ప్ర‌సాద్ ప్ర‌త్య‌క్ష సాక్షి అట‌. ఎన్టీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో ఉన్న నేప‌థ్యంలో దాదాపు నాలుగేళ్లు హిందీ భాష నేర్ప‌డంలో సాయం కోసం యార్ల‌గ‌డ్డ ఉద‌యాన్నే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేవాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న ల‌క్ష్మీపార్వ‌తి అతి చ‌నువు చూసి నేరుగా ఎన్టీఆరుతోనే *జ‌రుగుతోంది  త‌ప్పండీ* అన్నాడ‌ట‌. దానికి ఎన్టీఆర్ స్పందించ‌లేద‌ట‌. మ‌రో సంద‌ర్భంలో మోహ‌న్ రెడ్డి అనే పెద్దాయ‌న ఉన్న‌పుడు కూడా అదేమాట అన్నార‌ట‌. దీంతో ఫీల‌యిన ఎన్టీఆర్ *ఏం బ్ర‌ద‌ర్‌, ఏం చెబుతారు మీరు? యు ఆర్ మై ఫ్రెండ్‌. నా చేతుల్తో నేను అన్నం తిన‌లేను. వీపు తోముకోలేను. ఏ కోడ‌లు చేస్తుంది? ఏ కూతురు చేస్తుంది? ఎవ‌రు చేస్తారు ఇవ‌న్నీ?* అని కాస్త ఆగ్ర‌హంగా బుదులిచ్చార‌ట‌.

ఈ విష‌యాన్ని ఆయ‌న తాను ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ఆమెకు ద‌గ్గ‌ర‌వ‌డంపై చాలామందికి అభ్యంత‌రాలు ఉన్నా ఎవ‌రూ నోరు విప్పేవారు కాదు. నేను చాలాకాలం నోరు విప్ప‌లేదు. కానీ ఓ ద‌శ‌లో అనాల్సి వ‌చ్చింద‌ని యార్ల‌గ‌డ్డ చెప్పారు. ఇవ‌న్నీ ప్ర‌త్య‌క్షంగా చూసిన వ్య‌క్తి కాబ‌ట్టే... 1995లో రాష్ట్రం కోసం, కొన్ని శ‌క్తులు రాష్ట్ర భ‌విష్య‌త్తు నాశ‌నం చేయ‌కుండా వైస్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ లో నేను చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చాను. ఈరోజుకీ ఆ సంఘ‌ట‌న తెలుగు జాతి మేలు కోసం చేసిన‌ద‌నే న‌మ్ముతాను. నాకు ఏ పశ్చాత్తాప‌మూ లేదు. న‌న్ను చాలామంది తిట్టారు. కానీ ఆరోజు అధికారం చేతులు మార‌క‌పోయి ఉంటే రాష్ట్రం కుక్క‌లుచింపిన విస్త‌రి అయ్యి ఉండేది అని యార్ల‌గ‌డ్డ వివ‌రించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు