అసెంబ్లీ టవర్ డిజైన్ ఇడ్లీ పాత్రల్లా వున్నాయట

అసెంబ్లీ టవర్ డిజైన్ ఇడ్లీ పాత్రల్లా వున్నాయట

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు భుజానికెత్తుకున్న చంద్రబాబునాయుడికి ఆది నుంచి ఎదురవుతున్న కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రానికి ఒక గుర్తింపు తేవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విమర్శకులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా అదేపనిగా ఆయనపై రాళ్లేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో ఆయన ఏం చేసినా దాన్ని తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా విస్తృతం కావడంతో చంద్రబాబుపై దుష్ప్రచారం, వెటకారం చేయడం ఆయన వ్యతిరేకులకు ఈజీ అయిపోయింది. తాజాగా అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ డిజైన్ విషయంలో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, ఇది హద్దులు దాటుతుండడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.

క్యాబినెట్లో అసెంబ్లీ డిజైన్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీ డిజైన్ పై వస్తున్న కామెంట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారట. అసెంబ్లీ టవర్ డిజైన్ ఇడ్లీ పాత్రలా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం మంత్రివర్గ సహచరులు సిఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు...ఈ విషయం విన్న వెంటనే చంద్రబాబు మండిపడ్డారట. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలతో 100కు పైగా డిజైన్లు గీయించి, వాటి నుంచి ప్రజామోదం పొందిన డిజైన్ ను ఎంపిక చేస్తే, ఇటువంటి ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసమని ఆయన ఒకింత ఆవేదనకు లోనయ్యారట. భవన ఆకృతి ఇడ్లీ పాత్రలా, కుక్కర్ గిన్నెలా ఉందని అనుకుంటే, ఆ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందన్నారట. అమరావతి ఆకృతులపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదని మండిపడ్డారట.

అయితే.. సోషల్ మీడియాలోనే కొందరు మాత్రం ఈ బిల్డింగు ఇడ్లీ పాత్రలా ఉంటే ఏమైంది అంటూ తమ వాదన వినిపిస్తున్నారు. పక్షి స్ఫూర్తిగా విమానాన్ని కనిపెట్టారని ఎవరైనా చెబితే ఆహా అనుకుంటాం.. తూనీగ స్ఫూర్తిగా హెలికాప్టర్ కనుగొన్నారంటే అవును అచ్చంగా అలాగే అనిపిస్తుంది అనుకుంటాం. అంతేకానీ... ఇప్పుడు రైట్ బ్రదర్స్ ను కానీ.. హెలికాప్టరును కనిపెట్టినవారిని కానీ విమర్శించం కదా. అసెంబ్లీ ఇడ్లీ పాత్రలా ఉంటే  ఏమైంది.. ఒక కోణంలోంచి చూస్తే అలా ఉండొచ్చు. అంతమాత్రాన అదే పనిగట్టుకుని విమర్శించడం ఎంతవరకు సమంజసం అన్న వాదనా ఒకటి వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు