చంద్ర‌బాబుకూ ఫ్యాన్స్‌!... హైద‌రాబాదులో ఆఫీస్‌!

చంద్ర‌బాబుకూ ఫ్యాన్స్‌!... హైద‌రాబాదులో ఆఫీస్‌!

దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నేత‌ల‌కు ఫ్యాన్స్ లేక‌పోవ‌డం.. అదే స‌మ‌యంలో సేవ‌కు ఏమాత్రం సంబంధం లేని రంగాల‌కు చెందిన సినీ స్టార్లు, క్రీడాకారుల‌కు ఫ్యాన్స్ ఉంటుంద‌టం విచిత్ర‌మనే చెప్పాలి. సినీ, స్పోర్ట్స్ స్టార్ల‌కు ఫ్యాన్స్ ఉంటే... రాజ‌కీయ నేత‌ల‌కు మాత్రం అనుచ‌రులే ఉంటారు. అయితే సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కొంద‌రు నేత‌ల‌కు ఇటీవ‌లి కాలంలో ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఈ క్ర‌మంలో పుట్టుకొచ్చిందే చంద్ర‌దండు. అనంత‌పురం జిల్లా కేంద్రంగా కొన‌సాగుతున్న ఈ దండు... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అభిమానుల‌కు చెందిన‌దిగా మ‌నంద‌రికీ తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న దాకా చంద్ర‌బాబు తెలుగు నేల‌కంతా సీఎంగానే కాకుండా మంత్రిగా, ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన నేత‌, అయితే రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా 13 జిల్లాల‌తో ఏర్పాటైన న‌వ్యాంధ్ర‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు ప‌రిమిత‌మైపోయారు. మ‌రి టీడీపీకి తెలంగాణ‌లో కేడ‌ర్ లేదా? చ‌ంద్ర‌బాబు అనుచ‌రులు లేరా? అంటే... ఎందుకు లేరు... గ్రామస్థాయిలో ప‌టిష్ట నిర్మాణం ఉన్న పార్టీగా తెలంగాణ‌లో ఇప్ప‌టికీ నేత‌లు పోయినా... కార్య‌క‌ర్త‌లు మాత్రం అలాగే ఉన్నారు.

అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో చంద్ర‌బాబును అభిమానించే వారు కూడా చాలా పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. అయినా ఇప్పుడిదంతా ఎందుక‌న్న విష‌యంలోకి వ‌స్తే.. సినీ, స్పోర్ట్స్ స్టార్ల మాదిరిగా ఫ‌క్తు పొలిటీషియ‌న్ అయిన చంద్ర‌బాబుకు కూడా అభిమాన సంఘాలు వెల‌శాయి. అది కూడా హైద‌రాబాదు కేంద్రంగా చంద్ర‌బాబు ఫ్యాన్స్ ఏకంగా ఏ కార్యాల‌యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే చాలా ఆస‌క్తి క‌లిగించే అంశ‌మ‌నుకుంటే.. నారా చంద్ర‌బాబునాయుడు ఫ్యాన్స్ పేరిట ఏర్పాటైన ఈ కార్యాల‌యానికి గూగుల్ మ్యాప్స్ నుంచి గుర్తింపు కూడా ల‌భించేసింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి... హైద‌రాబాదులో నారా చంద్ర‌బాబునాయుడు నాయుడు ఫ్యాన్స్ అనే పేరు కొడితే.. అమీర్ పేట ప్రాంతంలో కొత్త‌గా ఏర్పాటైన ఈ కార్యాల‌యం ఆ మ్యాప్స్‌లో చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న చంద్ర‌బాబు ఫ్యాన్స్‌... సినీ స్టార్లు, స్పోర్ట్స్ ప‌ర్స‌న్ల‌కు ఉన్న అభిమానుల కంటే ఓ అడుగు ముందుకేశార‌నే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు