1972లోనే పూతరేకులపై రీసెర్చి చేసిన కేసీఆర్

1972లోనే పూతరేకులపై రీసెర్చి చేసిన కేసీఆర్

పూతరేకులన్న పేరు వింటేనే నోరూరిపోతుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆ పేరు, ఆ పదార్థం తెలియనివారు దాదాపు ఉండరేమో. కానీ... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాత్రం పూతరేకులంటే ఏంటో అర్థం కాలేదట. పూత రేకులంటే పూల రేకులేమో అనుకున్నారట. అవునా... కేసీఆర్‌కు ఇది కూడా తెలియదా అని ఆశ్చర్యపోవద్దు. ఇది ఇప్పటి మాట కాదు. నాలుగున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.

అప్పటికి మార్కెట్ ఇంతగా విస్తరించలేదు... ప్రపంచం ఇంతగా కుగ్రామం అయిపోలేదు... అప్పటి రోజుల్లో పూతరేకులంటే మూణ్నాలుగు జిల్లాలవారికి మాత్రమే తెలిసేవి. అయితే... ఒక సినిమా పాటలో పూతరేకుల ప్రస్తావన రావడంతో అదేంటో తెలుసుకోవాలని కేసీఆర్ అనుకున్నారట. దాని కోసం పెద్ద రీసెర్చే చేశారట.  తాజాగా హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న వేళ ఆయన 46 ఏళ్ల కిందట తాను చేసిన ఆ రీసెర్చిని ఆయన గుర్తు చేసుకున్నారు.

1972 ప్రాంతాల్లో శోభ‌న్‌బాబు న‌టించిన ఓ సినిమా చూశాన‌ని, ఆ సినిమాలోని ఓ పాట‌లో 'పూత‌రేకులు' అనే ఓ ప‌దం విన్నాన‌ని కేసీఆర్ అన్నారు. పూల‌రేకులకు బ‌దులు పూత‌రేకులు అని రాశారేమో అని అనుకున్నాన‌ని, అప్పుడు తాను ఆ సినిమా పాట‌ల పుస్త‌కాన్ని కొనుక్కుని చూశానని, అందులో కూడా పూత‌రేకులు అనే ప‌ద‌మే ఉందని.. దీంతో ఆ ప‌దానికి అర్థం తెలియ‌క త‌మ లెక్చ‌రర్‌ని అడిగాన‌ని, ఆయ‌న‌కు కూడా తెలియ‌ద‌ని చెప్పార‌ని, ఆ త‌రువాత ఆ లెక్చ‌ర‌రే ఆ ప‌దానికి అర్థం తెలుసుకుని త‌న‌కు చెప్పార‌ని కేసీఆర్ చెప్పారు. 1972లో అప్ప‌టికి తెలంగాణ‌కు పూత‌రేకులు రాలేదని... ఇప్పుడు మాత్రం హైదరాబాదులో ఏ మిఠాయి దుకాణంలోకి వెళ్లినా దొరుకుతోందని కేసీఆర్ చెప్పారు.  అనంతరం కేసీఆర్ ప‌లు తెలుగు ప‌ద్యాలు చ‌దివి, వాటి భావాల‌ను వివ‌రించి అందరినీ ఆకట్టుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు