ఇవాంకా... హైదారాబాదును మ‌రిచిపోలేక‌పోతోందా?

ఇవాంకా... హైదారాబాదును మ‌రిచిపోలేక‌పోతోందా?

భాగ్య‌న‌గ‌రిగా చ‌రిత్ర పుటల్లోకి ఎక్కిన హైద‌రాబాదు మ‌హాన‌గ‌రం ఇటీవ‌ల ఇచ్చిన ఆతిథ్యాన్ని అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా మ‌రిచిపోలేదు. హైద‌రాబాదులో గ‌త నెల‌లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌-2017కు అమెరికా ప్ర‌తినిధి బృందానికి నేతృత్వం వ‌హిస్తూ భాగ్య‌న‌గ‌రిలో కాలు మోపిన ఇవాంకా... మ‌న ఆతిథ్యానికి మైమ‌ర‌చిపోయింద‌నే చెప్పాలి. స‌ద‌స్సు మూడు రోజుల పాటు జ‌రిగినా... రెండు రోజుల పాటు మాత్ర‌మే హైద‌రాబాదులో ఉన్న ఇవాంకా గోల్కొండ కోట‌ను చూసి అచ్చెరువొందార‌నే చెప్పాలి. అంతేనా... హైద‌రాబాదు నేటివిటీ ఉన్న ప్ర‌తి అంశాన్ని అత్యంత ఆస‌క్తిగా గ‌మ‌నించిన ఇవాంకా... మ‌న నేటివీటిని వీల‌యినంత‌గా ఎలివేట్ చేస్తూ మాట్లాడారు. తెలంగాణ యువ మంత్రి కేటీఆర్‌తో చ‌తురోక్తులు కూడా పంచుకున్నారు.

స‌ద‌స్సు అనంత‌రం హైద‌రాబాదు జ్ఞాప‌కాల‌ను త‌న‌తో పాటే అమెరికాకు మోసుకుని వెళ్లిన ఇవాంకా వాటి నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. ఇందుకు సాక్ష్య‌మే ఇప్పుడు ఇవాంకా చేసిన ఓ ట్వీట్. హైద‌రాబాదులో జ‌రిగిన జీఈఎఎస్‌-2017 జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్న ఇవాంకా... అవి త‌న‌ను ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయ‌న్న విష‌యాన్ని, స‌ద‌స్సు జ‌రిగిన తీరు, ల‌భించిన ఆతిథ్యం త‌దిత‌రాల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ లెంగ్తీ ట్వీట్‌నే పోస్ట్ చేశారు. స‌ద‌స్సును భార‌త ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ స‌ర్కారు క‌లిసిన ఉమ్మ‌డి నిర్వ‌హించినా... అందులో అమెరికా భాగ‌స్వామ్యం కూడా ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే ప్ర‌పంచ దేశాల నుంచి జీఈఎస్ స‌ద‌స్సుకు 1,200 మంది ప్ర‌తినిధులు హాజ‌రైతే... ఒక్క అమెరికా నుంచే 350 మందితో ప్ర‌తినిధి బృందం హాజ‌రైంది. ఈ ప్ర‌తినిధి బృందానికి నేతృత్వం వ‌హించిన ఇవాంకా... మొత్తం స‌ద‌స్సులో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారిపోయింది.

ఇక ఈ స‌ద‌స్సును స్మ‌రించుకుంటూ చేసిన తాజా ట్వీట్‌లో ఇవాంకా ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే.. జీఈఎస్‌-2017లో పాలుపంచుకునే అవ‌కాశం ద‌క్కినందుకు గ‌ర్వంగా ఉంది. ఈ స‌ద‌స్సులో పాలుపంచుకోవ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజ‌ర‌య్యారు. అందులో 350 అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వివిధ దేశాల నుంచి అతిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు' అని ఆమె ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. ఇక చివ‌ర‌గా త‌న ట్వీట్‌కు 'ధన్యవాద్‌' అని ప్రత్యేకంగా హిందీపదం చేర్చి హైద‌రాబాదు జ్ఞ‌ప‌కాల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని ఆమె తేల్చి చెప్పేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు