సీప్లేన్‌లో ప్ర‌యాణించి అడ్డంగా బుక్క‌యిన మోడీ

సీప్లేన్‌లో ప్ర‌యాణించి అడ్డంగా బుక్క‌యిన మోడీ

ప్రధానమంత్రి  న‌రేంద్ర‌ మోడీ వినూత్న రీతిలో చేసిన ప్ర‌యాణం సెల్ఫ్ గోల్ అయింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగళవారం నాడు సబర్మతి నది నుండి ఈ సీప్లేన్‌లో ప్రయాణించి 180 కి.మీ దూరంలో వున్న ధరోరు డ్యామ్‌ వద్దకు చేరుకున్నారు. దాదాపు 35 నిముషాలపాటు సాగిన ప్రధాని ఈ సీప్లేన్‌ ప్రయాణంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. అదే స‌మ‌యంలో సంచ‌ల‌న అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్రధాని మోడీ చేసిన ఈ ప్రయాణం భద్రతా నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. భద్రతా నిబంధనల ప్రకారం ప్రధాని స్థాయి వ్యక్తి రెండు లేదా అంతకు మించిన ఇంజన్ల సామర్ధ్యం కలిగిన విమానాలలోమాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని మోడీ దాన్ని ఉల్లంఘించార‌ని పేర్కొంది. తాము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించు కునేందుకే ప్రధాని ఈ సీ ప్లేన్‌ ప్రయాణంతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయిన రాహుల్‌ గాంధీ విమర్శించారు.

మ‌రోవైపు ఈ జ‌ర్నీ వెనుక ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం వెలుగులోకి వ‌చ్చింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుండి ఈ నెల మూడవ తేదీన ఈ సీ ప్లేన్‌ భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఫ్లయిట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం క్వెస్ట్‌ కొడియాక్‌ 100 అనే ఈ సీప్లేన్‌ను విదేశీ పైలట్‌ నడుపుతున్నారు. ఆయన తన యాత్రలో భాగంగా ఈ నెలారంభంలో కరాచీలో మజిలీ చేశారు. సీ ప్లేన్‌ అక్కడి నుండి ఈ నెల 3వ తేదీన బయల్దేరి అదే రోజు ముంబయి చేరుకుంది. అక్కడి నుండి సోమవారం నాడు అహ్మదాబాద్‌కు బయల్దేరింది. అమెరికన్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో వున్న ఈ సింగిల్‌ ఇంజన్‌ సీ ప్లేన్‌ ఒక ప్రైవేటు వ్యక్తికి చెందినది. అహ్మదాబాద్‌ నుండి తనతో ప్రయాణించిన విఐపి 'మంచి వ్యక్తి' (వెరీగుడ్‌ పాసింజర్‌) అంటూ ఈ సీప్లేన్‌ పైలట్‌ జాన్‌ గౌలెట్‌ మోడీ గురించి చెప్పడం వివాదంగా మారింది.  

కరాచీ నుండి వచ్చిన ఈ సీప్లేన్‌లో ప్రధాని ప్రయాణించటంపై సోషల్‌ మీడియాలో అనేక వ్యాఖ్యలు వెల్లు వెత్తాయి. 'కరాచీ నుండి వచ్చిన ఈసీప్లేన్‌లో మీరెందుకు చక్కర్లు కొట్టారంటూ కాంగ్రెస్‌ నేతలు ట్విట్టర్‌లో మోడీని నిలదీశారు. సస్పెండయిన కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ఇంటిలో పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్‌ మహ్మూద్‌ కసూరీతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు, మాజీ దౌత్యవేత్తలు భేటీ కావటంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సీ ప్లేన్‌ ప్రయా ణంపై కాంగ్రెస్‌ సంధిస్తున్న ఈ విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు