ఇక రాహుల్ శ‌కం !

ఇక రాహుల్ శ‌కం !

ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఎప్పుడా మ‌రెప్పుడా అని కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల క‌ల‌లు నిజ‌మైపోయాయి. త‌మ యువ‌రాజును కాంగ్రెస్ పార్టీ చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌క‌టించాల‌ని.. గాంధీ కుటుంబానికి నాలుగో త‌రం సైతం కంగ్రెస్ స‌లాం చేయాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. దీనికి త‌గ్గ‌ట్లే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో ప‌ని చేశారు. ప‌లు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష‌ప‌ద‌వికి రాహుల్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ రోజుతో అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ గ‌డువు ముగిసింది. ఇప్ప‌టివ‌ర‌కూ రాహుల్ మిన‌హా మ‌రెవ‌రూ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌టంతో యువ‌రాజు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నిక‌ల అథారిటీ ఛైర్మ‌న్ ఎం రామ‌చంద్ర‌న్ ప్ర‌క‌టించారు.

దీంతో.. కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు అందుకునేందుకు రాహుల్‌కు ఇక‌పై ఎలాంటి అడ్డంకి లేన‌ట్లే.  గుజరాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌టానికి ముందే రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

గుజ‌రాత్‌.. హిమాచ‌ట్ ప్ర‌దేశ్ అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 18న విడుద‌ల కానున్నాయి. దీనికి రెండు రోజుల ముందే (డిసెంబ‌రు 16) ఆయ‌న పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 2004లో  రాజ‌కీయ అరంగేట్రం చేసిన రాహుల్.. ప‌ద‌మూడేళ్ల కాలంలో పార్టీలోని వివిధ విభాగాల్లో ప‌ని చేశారు.

2007లో కాంగ్రెస్ కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన ఆయ‌న‌.. 2013లో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా రాహుల్‌ను ప్ర‌క‌టించాల‌న్న నినాదాన్ని కేంద్ర‌మాజీ మంత్రి వీర‌ప్ప మొయిలీ తీసుకొచ్చినా.. అదేమీ పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాలేదు.

అయితే.. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌ల్ని రాహుల్ చేప‌ట్టారు. పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ప్ర‌చార బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏ రాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేద‌న్న అప‌ప్ర‌ద రాహుల్‌కు ఉండిపోయింది. గాంధీ వార‌సుల‌తోనే కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఎప్ప‌టినుంచో ఉన్నాయి.

తాజాగా రాహుల్ ప‌ట్టాభిషేకానికి ఎలాంటి అడ్డంకులు లేక‌పోవ‌టంతో.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు మిఠాయిలు పంచుకొని సంబ‌రాలు చేసుకున్నారు. దేశ రాజ‌ధానిలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ల‌యం వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన రాహుల్‌కు ఇప్ప‌టివ‌ర‌కూ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించిన సోనియాగాంధీ ధ్రువ‌ప‌త్రాన్ని అందించ‌నున్నారు. రాహుల్ త‌ల్లి.. రాజీవ్ గాంధీ స‌తీమ‌ణి సోనియాగాంధీ స‌రిగ్గా 19 సంవ‌త్స‌రాలు పార్టీ అధ్య‌క్షురాలిగా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. సో.. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ శ‌కం ఆరంభ‌మైన‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు