పవన్‌కు అర్థం కాదు… జగన్‌కు అసలేం తెలీదు!

పవన్‌కు అర్థం కాదు… జగన్‌కు అసలేం తెలీదు!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు త‌న మిత్ర‌ప‌క్ష‌, విప‌క్ష నేత‌ల‌పై పంచ్‌లు వేశారు. పోలవరం మీడియా సమావేశంలో చంద్రబాబు జగన్‌తోపాటు పవన్‌కు చురకలంటించారు. ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయమన్న పవన్‌ డిమాండ్‌పై ఆయన స్పందించారు. ఆయనకింకా ఇలాంటి విషయాలు అర్థం కావన్నారు. జగన్‌కు అసలు అవగాహనే లేదన్నారు. నదుల అనుసంధానం పట్ల కూడా జగన్‌కు తగిన పరిజ్ఞానం లేదన్నారు. ఇలాంటి నేతలంతా పోలవరం ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడ్డం హాస్యాస్ప దంగా ఉందన్నారు.

కొత్తగా వచ్చేవారేదేదో మాట్లాడ్డం తగదని ప‌రోక్షంగా ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చా రు. ముందుగా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌పై తగిన అవగాహన తెచ్చుకున్న తర్వాతే వ్యాఖ్యలు చేయాలని ఎత్తిపొడిచారు. అసలు ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం జరిగి ఉండని పక్షంలో పోలవరం నిర్మాణం ఊహకు సైతం అందదన్నారు. కొత్తగా ఈ శ్వేతపత్రం ఏంటంటూ అని ఆయన మండిపడ్డారు. రోజువారీ లెక్కలకంటే శ్వేతపత్రం ఎక్కువా అని ప్రశ్నించారు. తెలిసీతెలియని పరిజ్ఞానంతో ప్రాజెక్ట్‌ను అడ్డుకోవద్దంటూ హెచ్చరించారు. ఏళ్ళ తరబడి పులివెందుల ఎదుర్కొంటున్న నీటి కష్టాలు తాను తొలగిస్తే పోలవరానికి సంబంధించి వైసిీపీకి తాను లెక్కలు చెప్పాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటి సరఫరా చేస్తామన్నారు.

యూపీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త భూసేకరణ విధానం నష్టపరిహార చెల్లింపు వ్యయం 11రెట్లు పెరిగిందని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు మూడువేల కోట్లున్న పునరావాస వ్యయం 33వేల కోట్లకు చేరుకుందన్నారు. సుమారు 2లక్షల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సొచ్చిందన్నారు. ఇంకా 95,818 కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించాలన్నారు. ఒక్కొక్కరికీ 17నుంచి 18లక్షల వరకు చెల్లించాల్సొస్తోందన్నారు. నిబంధనల మేరకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఈ మొత్తాలు చెల్లిస్తున్నామన్నారు. కొత్త చట్టం మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలా అక్కర్లేదా అంటూ ఆయన ప్రతిపక్షాల్ని నిలదీశారు. కావాలని ఈ వ్యయంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని సహించేదిలేదని హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు