న్యూయార్క్‌లో బాంబు ఎలా పేలిందంటే..

న్యూయార్క్‌లో బాంబు ఎలా పేలిందంటే..

న్యూయార్క్‌ లోని టైమ్స్‌ స్క్వేర్‌ సమీపంలో జ‌రిగిన పేలుడు వెనుక కార‌ణాలు వెలుగులోకి వ‌చ్చాయి. మన్‌హాటన్‌ లోని పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్మినల్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగిన సంగ‌తి తెలిసిందే. సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణానికి బాధ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 42వ వీధిలో పేలుళ్ళు జరిగినట్టు తమకు సమాచారం అందడంతో తక్షణమే స్పందించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కొందరు గాయపడినట్టు తెలిపారు. ఏ, సీ, ఈ వీధులను ఖాళీ చేయించినట్టు తెలిపారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం పైప్‌ బాంబును పేల్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్‌ టెర్మినల్‌కు వెళ్ళే దారిలో దీనిని అమర్చినట్టు భావిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల నుంచి స్ఫూర్తి పొందిన బంగ్లాదేశ్ సంతతి యువకుడు అకాయెద్ ఉల్లా (27) సోమవారం ఉదయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించాడని స‌మాచారం. రద్దీ సమయంలో న్యూయార్క్‌లోని ఒక సబ్ వే వద్ద తనను తాను పేల్చుకునేందుకు ప్రయత్నించడంతో నలుగురు గాయపడ్డారు.

బ్యాటరీ అమర్చిన పైపు బాంబుతో తనను తాను పేల్చి వేసుకోవడానికి ప్రయత్నించాడని, అది పూర్తిగా పేలకపోవడంతో గాయపడిన అకాయెద్ ఉల్లాను అరెస్ట్ చేశామని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. గాయపడ్డ అతన్ని దవాఖానలో చేర్చామన్నారు.

దాడి గురించి తమకు ఉదయం 7.19 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని న్యూయార్క్ అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్మినల్‌ అమెరికాలో అతి పెద్దది. సంవత్సరానికి సుమారు 6.5 కోట్ల మందికి పైగా ఇక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు