రాహుల్ తొలి సంతకంపై రఘువీరా హామీ

రాహుల్ తొలి సంతకంపై రఘువీరా హామీ

తెలుగు రాష్ఱ్టాల్లో తొలి సంతకాల సంగతి తెలిసిందేగా.. తాను సీఎం అయితే తొలి సంతకం ఆ ఫైలుపైనేనంటూ నేతలు హామీలిస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషిక్తుడు కానున్న రాహుల్ గాంధీ 2019 ఎన్నికల తరువాత ప్రధాని అయితే తొలి సంతకం దేనిపై పెడతారన్న విషయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు హామీలిచ్చేస్తున్నారు. రాహుల్‌తో సంబంధం లేకుండా ఇక్కడి నేతలు మాటిచ్చేస్తున్నారు. తాజాగా ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి... రాహుల్ గాంధీ ప్రధాని అయితే, తొలి సంతకం దేనిపై పెడతారో చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపైనే రాహుల్ తొలి సంతకం చేస్తారని ఆయన జనానికి హామీ ఇచ్చారు.

    కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ‘ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం’ గురించి ప్రజలకు తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ఆ క్రమంలో  బహిరంగ సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో కూడా జాతీయ పార్టీని బలోపేతం చేసి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తారని తెలిపారు.

    అయితే... ఏపీపై ఆశలన్నీ వదులుకున్న తరుణంలో రఘువీరా చెప్తున్నట్లుగా రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ పెద్దలు కానీ తొలి సంతకం పెట్టేంతగా అంత ప్రాధాన్యం ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకునే నార్త్ ఇండియన్ స్టేట్స్‌కు సంబంధించిన అంశాలు, మరీ ముఖ్యంగా తమకు కొరుకుడుపడని ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి అలాంటి తొలి సంతకం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో రఘువీరావి శుష్క వాగ్దాలేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు