నాకా.. నాగార్జునతో గొడవా?

నాకా.. నాగార్జునతో గొడవా?

అక్కినేని నాగార్జునకు.. ఆయన మేనల్లుడు సుమంత్‌కు విభేదాలని ఎప్పట్నుంచో రూమర్లున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మరణానంతరం ఆస్తుల పంపకం విషయంలో ఇద్దరికీ తేడా వచ్చిందని.. అంతకుముందు నుంచి కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని.. ‘మనం’ సినిమా రిలీజ్ టైంలో సుమంత్ దూరంగా ఉండటం.. ఆ తర్వాత కూడా నాగార్జునతో పెద్దగా కలిసి కనిపించకపోవడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.

ఈ విషయమై సుమంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. మీకూ.. మీ మావయ్యకు గొడవలంట కదా అని అడిగితే.. ‘‘మీడియా వాళ్లు ఇలా అనుకుంటున్నారా.. అలాంటి వార్తలేమీ నేనెక్కడా వినలేదే. చూడలేదే’’ అంటూ ఆశ్చర్యపోయాడు సుమంత్.

ఇక తనకు తన మావయ్యతో గొడవలెందుకుంటాయని సుమంత్ ప్రశ్నించాడు. ఈ ఇంటర్వ్యూ అయ్యాక తాను తన మావయ్య దగ్గరికే వెళ్లబోతున్నానని.. గంట ముందు కూడా తామిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని చెప్పాడు సుమంత్. తన మావయ్యకు తన కొత్త సినిమా ‘మళ్ళీ రావా’ స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు అతను వెల్లడించాడు. అక్కినేని హీరోలతో కలిసి తాను మల్టీస్టారర్ సినిమాలు చేయాలని కూడా ఆశిస్తున్నానని.. మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తానని సుమంత్ చెప్పాడు.

‘మనం’ సినిమాకు నంది అవార్డు రాకపోవడం గురించి స్పందిస్తూ.. ఈ గొడవేంటో తనకు తెలియదని.. తాను దాని గురించి స్పందించిన కాంట్రవర్శీ చేయనని.. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారని.. తమ కుటుంబం వారికి రుణపడి ఉంటుందని సుమంత్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు