పవన్ నిజంగా మాట మీద నిలబడతాడా?

పవన్ నిజంగా మాట మీద నిలబడతాడా?

సినిమాల నుంచి రాజకీయాల వైపు మళ్లాక మళ్లీ సినిమాల్లోకి రావడం అంత సులువేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆయనకు మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో విఫలమైనా సరే.. చిరు మళ్లీ సినిమాల వైపు చూసేలా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తూ మంత్రిగా.. ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నాడు చిరు. ఐతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూడటంతో చిరు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. దీంతో మళ్లీ ఆయనకు సినిమాలపై మనసు మళ్లింది. ‘ఖైదీ నంబర్ 150’తో మళ్లీ తెరంగేట్రం చేశారు. ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టిసారించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భవితవ్యం ఎలా ఉండబోతోందన్న చర్చ నడుస్తోంది. వచ్చే ఏడాది నుంచి తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని.. ఆ తర్వాత రాజకీయాలకే అంకితం అవుతానని.. పవన్ ముందు నుంచి చెబుతున్నాడు. తాను మళ్లీ సినిమాల్లోకి రావడం కూడా అనుమానమే అన్నాడు. ఐతే తాజాగా మూడు రోజుల రాజకీయ పర్యటన సందర్భంగా పవన్ మళ్లీ ఈ విషయమై మాట్లాడాడు. చాలామంది తనను పార్ట్ టైం పొలిటీషియన్ అంటుంటారని.. కానీ ఇప్పటికి ఎలా ఉన్నా.. తాను పూర్తిగా రాజకీయాల్లోకి దిగాక మాత్రం పక్కా పొలిటీషియన్ లాగే ఉంటానని.. మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో సందేహమే లేదని పవన్ అన్నాడు. ఐతే 2019 ఎన్నికల్లో గెలిచేసి పవన్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్న అంచనాలైతే లేవు. కాకపోతే పవన్ ప్రమేయం ఎంతో కొంత ఉండొచ్చు.

2009లో ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాయిలో పవన్ పార్టీ ప్రభావం చూపినా గొప్పే. ఒకవేళ అదే స్థాయిలో లేదా అంత కంటే తక్కువ స్థాయి ఫలితాలు రాబట్టిన పక్షంలో పవన్ ఆ తర్వాత రాజీకీయాలకే అంకితమై ఉంటాడా.. తిరిగి సినిమాలు చేయడా అన్నది ప్రశ్న. చాలామంది మాత్రం చిరు తరహాలోనే పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడనే భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దంటున్నాడు. మరి నిజంగానే అతను మాట మీద నిలబెట్టి అభిమానుల్ని నిరాశకు గురి చేస్తాడా.. చిరును ఒత్తిడి చేసినట్లు పవన్‌ను కూడా అభిమానులు ఫోర్స్ చేస్తే అతను లొంగకుండా ఉంటాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు