విజ‌య‌వాడ కుల‌పిచ్చిపై ప‌వ‌న్ కామెంట్స్‌

విజ‌య‌వాడ కుల‌పిచ్చిపై ప‌వ‌న్ కామెంట్స్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్య రాజ‌కీయం చేస్తున్నార‌ని అంటున్నారు. ఒకింత ఎక్కువ‌ గ్యాప్ త‌ర్వాత క్రియాశీలంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించిన ప‌వ‌న్ మొద‌ట డీసీఐ ఉద్యోగుల స‌మ‌స్య‌లు, అనంత‌రం పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సంద‌ర్భాల్లో ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంసించారు. బాబుపై పూర్తి విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. కానీ ప‌వ‌న్ త‌న టూర్‌ చివ‌రి రోజున అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. బాబుపై ఒక‌రంగా ఘాటుగా రియాక్ట‌య్యారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ లో ఎవరు బెటరో చూసుకుని మద్దతిచ్చానని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించారు. ఏ సమస్యనైనా విని పరిష్కరించేందుకు చంద్ర‌బాబు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ పై అభియోగాలు, కేసులు ఉన్నాయ‌నే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని, కేసులు లేక‌పోతే ఆయ‌న‌తో జ‌త‌క‌ట్ట‌డానికి త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిత్వం గురించి ప‌వ‌న్ వివ‌రించారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే తాను చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను చాలా నిగ్రహంగా రాజకీయాలు చేస్తున్నానని అయితే...దానిని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. పదునైన, బలమైన రాజకీయాలు నేను కూడా చేయగలనని ప‌వ‌న్ తేల్చిచెప్పారు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నందువల్లనే సీఎం చంద్ర‌బాబును, ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ప‌వ‌న్ తెలిపారు. అదే సమయంలో దీనిని తన చేతగానితనంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అలాగే డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు పోవడం తగదని ఏపీ సర్కార్ కు సూచించారు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వృథా అని చురకంటించారు. రాష్ట్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాననీ, అన్ని సమస్యలపైనా పోరాడుతానని పవన్ తేల్చిచెప్పారు.

భిన్న కులాల మ‌ధ్య ఐక్య‌త ఉంటే త‌ప్ప అమ‌రావ‌తి ఫ‌స్ట్ క్లాస్ క్యాపిట‌ల్ అవ్వ‌ద‌ని ప‌వ‌న్ చెప్పారు. తెలంగాణలో కంటే ఏపీలో కులపిచ్చి ఎక్కువగా ఉందన్నారు. విజ‌య‌వాడ‌లో ఇంకా కులాల ప్ర‌స్తావ‌న ఉందని, ఏపీ అభివృద్ధి చెందాలంటే కులాల గొడ‌వ‌లు పోవాల‌ని అన్నారు. కులపిచ్చి వదులుకుంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. త‌న‌కు కాపు ద‌గ్గ‌ర కాదు.. క‌మ్మ దూరం కాద‌ని అన్నారు. క‌మ్మ ఆడ‌ప‌డుచుకి క‌ష్ట‌మొచ్చినా .. ప‌వ‌న్ క‌ల్యాణ్ గుండె బాధ‌ప‌డుతుంద‌ని చెప్పారు. కులాల గొడ‌వ‌లు లేని అమ‌రావ‌తిని చూడాల‌నుకుంటున్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.  ప్రభుత్వం ఒక విషయాన్ని చక్కదిద్దే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కాగా, ప‌న‌వ్ ప‌ర్య‌ట‌న మొద‌టి రెండు రోజులు బాబును స‌మ‌ర్థించిన ప‌వ‌న్ మూడో రోజు ఆయ‌న‌పై విరుచుకుప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు