ప‌వ‌న్ నోట వంగ‌వీటి మాట‌!

ప‌వ‌న్ నోట వంగ‌వీటి మాట‌!

ఎప్పుడూ లేని రీతిలో ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావిస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్టీ పెట్టిన ప‌వ‌న్‌.. ఇంత‌కాలం ఆన్ అండ్ ఆఫ్ అన్న‌ట్లుగా రాజ‌కీయాలు చేయ‌టం తెలిసిందే. త్వ‌ర‌లో తాను క్రియాశీల‌క రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పినప్ప‌టికి.. చెప్పిన టైంకు ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు.

ఎప్ప‌టి మాదిరి ఉన్న‌ట్లుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వ‌న్‌..గ‌డిచిన మూడు రోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తున్న ప‌వ‌న్ తాజాగా నిర్వ‌హించిన పార్టీ ఔత్సాహికుల స‌మావేశంలో ఆయ‌న దివంగ‌త నేత వంగ‌వీటి రాధాకృష్ణ గురించి మాట్లాడారు.

విజ‌య‌వాడ రాజ‌కీయాల గురించి మాట్లాడేట‌ప్పుడు వంగ‌వీటి ప్ర‌స్తావ‌న త‌ప్ప‌నిస‌రి అవుతుంద‌ని.. ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌కుండా విజ‌య‌వాడ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌లేమ‌న్నారు. వంగ‌వీటి మాట ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చినంత‌నే పార్టీ ఔత్సాహికులుగా చెప్పే వారంతా ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున కేకులు.. అరుపులు వేశారు.
దీంతో.. వారిని వినాల‌న్న‌ట్లుగా సంకేతాలు చెబుతూ.. టోన్ డౌన్ చేసి మాట్లాటం మొద‌లెట్టారు.

వంగ‌వీటి హ‌త్య‌ను త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న‌.. నిరాయుధుడిగా ఉన్న వ్య‌క్తిని చంప‌టం స‌రికాద‌న్న ప‌వ‌న్‌.. వంగ‌వీటి హ‌త్య నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో చోటు చేసుకున్న అల్ల‌ర్ల గురించి చెప్పారు. ఒక నేత చ‌నిపోవ‌టం కార‌ణంగా ప‌ది రోజుల పాటు విజ‌య‌వాడ అల్ల‌ర్ల‌తో అట్టుడికిపోయింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌ల్లో ఒక మ‌హిళ త‌న ఇంటికి అల్ల‌రి మూక‌లు రావ‌టంతో భ‌యంతో పై నుంచి కింద‌కు దూకింద‌న్నారు. దీంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయ‌ని.. వంగ‌వీటికి ఆమెకు ఎలాంటి సంబంధం లేన‌ప్ప‌టికీ ఆమె బాధితురాలిగా మిగిలింద‌న్నారు.

వంగ‌వీటి హ‌త్య త‌ప్ప‌న్న ప‌వ‌న్‌.. స‌మాజంలో ఇలాంటివి చూపించే ప్ర‌భావం ఎంతో ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో ఉన్న కుల విద్వేషాల గురించి మాట్లాడారు. తెలంగాణ‌లో కుల భావ‌న ఉండ‌ద‌ని.. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. రాజ‌కీయ నేత‌లు స‌హ‌జంగా ప్ర‌స్తావించ‌ని కులాల లోతుల గురించి మాట్లాడిన ప‌వ‌న్‌.. కుల భావ‌న‌ల్ని వ‌దిలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు