పోల‌వ‌రం వెళ్లిన ప‌వ‌న్ అక్క‌డేం చేశారంటే..

పోల‌వ‌రం వెళ్లిన ప‌వ‌న్ అక్క‌డేం చేశారంటే..

గ‌డిచిన కొద్ది రోజులుగా మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంద‌ర్శించారు. త‌న‌కు పోల‌వ‌రం ప్రాజెక్టు మీద అవ‌గాహ‌న త‌క్కువ‌ని.. అందుకే తెలుసుకోవ‌టం కోసం తాను వ‌చ్చిన‌ట్లుగా ప‌వ‌న్ పేర్కొన్నారు. ముందుగా పేర్కొన్న షెడ్యూల్‌కు త‌గ్గ‌ట్లే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి కారులో బ‌య‌లుదేరి పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు.

పెద్ద ఎత్తున పోలీసులు.. వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది  న‌డుమ ప‌వ‌న్ ప్రాజెక్టును సంద‌ర్శించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎస్ఈ స్వ‌యంగా ప‌వ‌న్‌కు ప్రాజెక్టు వివ‌రాల్ని వెల్ల‌డించారు. స్పిల్ వే.. డ‌యా ఫ్రం వాల్‌.. ఎర్త్ క‌మ్ రాక్ ఫిల్ డ్యాంల‌కు సంబంధించి నిర్మాణాల్ని హిల్ వ్యూ నుంచి ప‌రిశీలించారు. ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ప‌వ‌న్ భావించినా పోలీసులు వ‌ద్ద‌ని వారించారు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ త‌ర్వాత వెల్ల‌డించారు.

అభిమానులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు చేరుకోవ‌టం.. ప‌నులు జ‌రుగుతున్న చోట‌కు వెళ్లి వ‌చ్చిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తాను మ‌రోసారి పోల‌వ‌రం రానున్న‌ట్లు చెప్పారు.

ఈసారి తాను వ‌చ్చిన‌ప్పుడు పున‌రావాసం ఎలా జ‌రుగుతుందో చూస్తాన‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్యాకేజీలు స‌రిగ్గా లేవ‌నే అంటున్నార‌ని.. దీనిపై లోతైన చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు.
ఇళ్లు.. భూములు కోల్పోయిన వారికి తాను అండ‌గా ఉంటాన‌న్నారు. రూ.33వేల కోట్లు నిర్వాసితుల‌కు ప్ర‌క‌టించినా.. ఆ మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ త‌మకు అంద‌లేద‌ని బాధితులు చెబుతున్నార‌న్నారు. ఆ డ‌బ్బు ఏ నాయ‌కుడి వ‌ద్ద‌కువెళ్లిన‌ట్లు తెలిసినా తాను పోరాడ‌తాన‌న్నారు. తాను రాజ‌కీయాలు చేయ‌టం కోసం రాలేద‌న్నారు. తాను బీజేపీ.. టీడీపీకి వ్య‌తిరేకం కాద‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే త‌న ల‌క్ష్యంగా చెప్పారు.  

పోల‌వ‌రం ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న కాట‌న్ కాలంలో జ‌రిగినా ఇప్ప‌టివ‌ర‌కూ కార్య‌రూపం దాల్చ‌లేద‌న్న ప‌వ‌న్‌.. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్ర‌భుత్వానిదో.. పార్టీదో కాద‌న్నారు. ఈ ప్రాజెక్టు కార‌ణంగా ఎంత లాభం.. ఎంత న‌ష్టం అన్న‌ది ప‌రిశీలించాల‌న్నారు. నిర్మాణ జాప్యం పెరిగే కొద్దీ ప్రాజెక్టు వ్య‌యం విప‌రీతంగా పెరుగుతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప‌వ‌న్‌.. ఈ ప్రాజెక్టు మొద‌ట అనుకున్న‌ప్పుడు రూ.125 కోట్లుగా ఉంటే.. ఇప్పుడ‌ది కాస్తా రూ.50వేల కోట్ల‌కు చేరింద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు