అంద‌ర్ని రౌండ్ ఏసుకున్న ప‌వ‌న్‌

అంద‌ర్ని రౌండ్ ఏసుకున్న ప‌వ‌న్‌

ఆచితూచి మాట్లాడిన‌ట్లుగా క‌నిపించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. పార్టీ కోసం ప‌ని చేయ‌నున్న వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న త‌న‌దైన సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడూ లేని విధంగా ఆయ‌న అంద‌రిపైనా విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు.

ఏ ఒక్క‌రిని వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రిని క‌లిపి హోల్ సేల్ గా రౌండ్ ఏసుకున్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధాని మోడీ మొద‌లుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ర‌కూ ఆయ‌న ఏ ఒక్క‌రినీ వదిలిపెట్ట‌లేదు. త్వ‌ర‌లో తాను రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌న వ్యాఖ్య‌ల ద్వారా రానున్న రోజుల్లో విమ‌ర్శ‌ల మోతాదును మ‌రింత పెంచ‌నున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ప్ర‌ధాని మోడీని.. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ..  రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే కాద‌ని.. బీజేపీ కూడా త‌ప్పు చేసింద‌ని.. ఆ విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు. మ‌రో సంద‌ర్భంలో ప‌రోక్షంగా మోడీపై విమ‌ర్శ‌ను సంధించారు. తాను విమ‌ర్శ‌లు చేస్తే కేసులు పెడ‌తార‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని.. న‌న్నేం పీక్కుంటారంటూ ఆవేశంతో వ్యాఖ్యానించ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే ర‌క్తం వ‌చ్చేలా కొట్టించుకోవ‌టంతో పాటు.. జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధ‌మ‌ని చెప్పారు.

చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ.. పోల‌వ‌రం ప్రాజెక్టులో ఏం అవినీతి జ‌రుగుతుందో నాకు తెలీదా? అంటూ వ్యాఖ్యానించ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌కుంటే రానున్న ఎన్నిక‌ల వేళ నాటికి ఓట్లు అడిగే హ‌క్కును కోల్పోతార‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ ను ఉద్దేశించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర‌లు చేస్తే సీఎంలు అయిపోతారా? అని ప్ర‌శ్నించారు. ఈ మాట అన్న ప‌వ‌న్‌.. మ‌రోవైపు తాను అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర‌.. బ‌స్సు యాత్ర‌.. ఏ యాత్ర‌కు సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీరియ‌స్ వ్యాఖ్య ఒక‌టి చేశారు. అవినీతి విష‌యంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ది త‌న‌కు తెలుస‌ని.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రోళ్లు అంటూ మాట్లాడిన వారే.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌కు ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వ‌ట‌మేమిటి? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌క‌భూమిక పోషించిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. త‌న‌కు స్వేచ్ఛ లేద‌ని ప్ర‌జారాజ్యంలో వ్యాఖ్యానించార‌ని.. నిజంగా ప‌ర‌కాల‌కు ప్వేచ్ఛ కానీ లేకుంటే పార్టీ ఆఫీసులో పార్టీ వేదిక నుంచి ఈ విమ‌ర్శ‌లు ఎలా చేయ‌గ‌లుగుతార‌ని ప్ర‌శ్నించారు త‌న అన్న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్ర‌జారాజ్యం పార్టీ గురించి మాట్లాడారు. త‌న అన్న‌ను మోసం చేశార‌న్న ప‌వ‌న్‌.. త‌న అన్్న‌ను దెబ్బ తీసిన వారిలో ఏ ఒక్క‌రిని వ‌దిలిపెట్ట‌నంటూ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు