బాబు టూర్ అదుర్స్

బాబు టూర్ అదుర్స్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌ తొలిరోజు సక్సెస్ అయింది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన బృందం తొలిరోజు ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కియో అనుబంధ పరిశ్రమలు అంగీకారం తెలిపాయి. రాష్ట్రంలో రూ. 4,995.20 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలకు కియో అనుబంధ సంస్థ‌లు మద్దతు పలికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. దీంతోపాటు 35 కంపెనీలకు చెందిన పారిశ్రామిక గ్రూపులతో ఏపీ ఎకనమిక్‌ డెవలప్మెంట్‌ బోర్డ్‌ (ఏపిీఈడీబీ) లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఎఫ్‌ఐ) చేసుకుంది. వీటి విలువ సుమారు 3వేల కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో 7,171 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అనంతపురం లో దేశంలోనే మొట్టమొదటి లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన బీటీఎన్ కంపెనీ ముఖ్యమంత్రి బృందానికి ప్రతిపాదన చేసింది. దక్షిణ కొరియా, భారతదేశం మధ్య పది బిలియన్‌ డాలర్ల ఆర్ధిక సహాయ ఒప్పందంలో భాగంగా ఈ సిటీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ పరిశ్రమల శాఖ, ఈడీబిలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఆ సంస్ధ ఎం.డి ప్రొఫెసర్‌ వై. కిమ్‌ ను కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా గ్రాన్‌ సియోల్‌ ఇంజనీరింగ్‌ఒ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ ఫోరెస్ట్‌ లిమ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లు టె జిన్‌ కిమ్‌, హున్‌ హాంగ్‌ హూ,, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లిమ్‌ చాంగ్‌ మిన్‌లతో బేటీ అయ్యింది. అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే స్టేడియంల నిర్మాణంలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్ధ ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సంస్ధకు ఆఫ్రికా దక్షిణ అమెరికాలతో పాటు ముంబాయి, ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయి.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్రీడా నగరం నిర్మించనున్నామని, అదే విధంగా రాష్ట్రంలో వంతెనలు, రహదారులు , ఇతర మౌలిక వసతుల నిర్మాణాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆ సంస్ధ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ నిర్మాణాల్లో అవసరమైన సహాయ సహకారాలను అందించాలని కోరారు.

ఉక్కు, రసాయనాలు , ఇంజనీరింగ్‌ నిర్మాణ రంగం క మోడిటీ ట్రేడింగ్‌ లో విశేష అనుభవం ఉన్న పోస్కో సంస్ధ భారత్‌లో ఎల్‌ఎన్‌జీ వాల్వ్‌ చెయిన్‌ బిజినెస్‌పై ఆసక్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్కో దేవూ సంస్ధ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూసీబో తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డౌన్‌ స్ట్రీమ్‌ పెట్రో కెమికల్స్‌ ఇండస్ట్రీ పై ఈ సంస్ధ ఆసక్తి చూపింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని పెట్రో కారిడార్‌ లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రతిపాదనలతో వస్తే పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్కో సంస్ధ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో నీటి శుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై దక్షిణ కొరియాకుచెందిన హేనోల్స్‌ కెమికల్స్‌ ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హేనోల్స్‌ కెమికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టెఫాని, జిఎం గెనెబోక్‌ కిమ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్ధ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టెఫానీ మాట్లాడుతూ భారతదేశం శక్తివంతమైన తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని, ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.

నీటి శుద్ధికి ఉపయో గించే రసాయనాలు, స్మార్ట్‌ ఫోన్‌లో వినియోగించే పెయింట్‌ను తమ సంస్ధ తయారు చేస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై డిపిఆర్‌లను అందించాలని సూచించారు.

దక్షిణ కొరియాకు చెందిన హ్యోసంగ్‌ సంస్ధ టెక్స్‌టైల్స్‌, గార్మెంట్‌ పరిశ్రమలు భారత్‌లో స్దాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నైలాన్‌ పాలిస్టర్‌, పవర్‌ సిస్టమ్‌ అంశంలో అపార అనుభవం ఉన్న హ్యోసంగ్‌ సంస్ధ వైస్‌ ప్రెసిడెంట్‌ జె జూంగ్‌లీతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భారత్‌లో యూనిట్‌లు పెట్టేందుకు తగిన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నామని హ్యోసంగ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం ఇవ్వలేనంతా ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇవ్వడంతో పాటు తమ ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని , ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని హ్యోసంగ్‌కు విజ్జప్తి చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండిక్స్‌, కియా వచ్చిన విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు