జ‌గ‌న్ ఎంత‌లా తిట్టారో చెప్పారో చెప్పిన మ‌హిళా ఎమ్మెల్యే

జ‌గ‌న్ ఎంత‌లా తిట్టారో చెప్పారో చెప్పిన మ‌హిళా ఎమ్మెల్యే

ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తున్న పేరు గిడ్డి ఈశ్వ‌రి. సాధార‌ణ టీచ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా ఆమె ప్ర‌యాణం చూస్తే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. గిరిజ‌న మ‌హిళ త‌న‌కు తాను ఎద‌గ‌ట‌మే కాదు.. ఈరోజు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ పాడేరు ఎమ్మెల్యే ఇటీవ‌ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితురాలిగా పేరున్న గిడ్డి ఈశ్వ‌రి తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తాను పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయాన‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. జ‌గ‌న్ తీరును తీవ్రంగా నిర‌సించారు. మ‌హిళా ఎమ్మెల్యే న‌ని చూడ‌కుండా త‌న‌ను అవ‌మానించిన వైనాన్ని.. తిట్టిన విష‌యాల్ని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్పిన గిడ్డి ఈశ్వ‌రి.. తాను పార్టీ మార‌టానికి కార‌ణ‌మైన ఉదంతాన్ని చెప్పారు. ఆ విష‌యాన్ని ఆమె మాట‌ల్లోనే చూస్తే.. 

అర‌కు ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావు బ‌య‌ట‌కు వెళ్లాక అక్క‌డి బాధ్య‌త‌లు చూసుకొమ్మ‌ని చెప్పారు. అర‌కు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు కూడా న‌న్నే చూడ‌మ‌న్నారు. దీంతో వాల్మీకి గెత‌కు చెందిన శెట్టి ఫ‌ల్గుణ అనే బ్యాంక్ ఉద్యోగిని జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి ప‌రిచ‌యం చేశా. జ‌గ‌న్ సూచ‌న‌తో ఏడేళ్ల స‌ర్వీసు ఉన్న ఉద్యోగాన్ని.. నెల‌కు ల‌క్ష‌న్న‌ర రూపాయిల జీతాన్ని వ‌దిలేసి పార్టీలోకి వ‌చ్చి ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికి ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేశారు.

అక్టోబ‌రు 12న హైద‌రాబాద్‌లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో మీరే అభ్య‌ర్థి అని ఫ‌ల్గుణ‌కు జ‌గ‌న్ చెప్పారు. ఆ త‌ర్వాత కుంబా ర‌విని పార్టీలో చేర్చుకునేందుకు రెఢీ అయ్యారు. విష‌యం తెలుసుకొని జ‌గ‌న్ పీఎకు ఫోన్ చేస్తే లండ‌న్ వెళ్లార‌ని చెప్పారు.

దీంతో.. విజ‌య‌సాయిరెడ్డికి  ఫోన్ చేస్తే.. ర‌వి ఇష్యూ మీకెందుకు?  మీకేం సంబంధం అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ర‌వి అంశంలో జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. దీని గురించి మాట్లాడేందుకు లండ‌న్ నుంచి జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఇడుపుల‌పాయ‌కు వెళ్లా. అపాయింట్ మెంట్ దొర‌క్క‌పోయినా బ‌లవంతంగా టెంట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లిశాం. అన్నా.. మ‌మ్మ‌ల్ని అన్యాయం చేయ‌కండి.. మిమ్మ‌ల్నే న‌మ్ముకొని ఉన్నామ‌న్నారు.

దీనికి జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. నీకు సంబంధం లేని విష‌యాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావంటూ కటువుగా మాట్లాడారు. ర‌వి అర‌కు ఎమ్మెల్యే అయితే నీకేంటి న‌ష్ట‌మ‌న్నారు. అన‌వ‌స‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్దు.. సోది మాట‌లు మాట్లాడొద్దు.. నీ ప‌ని నువ్వు చూసుకో అంటూ తెగేసి చెప్పారు. పంచాయితీ చేయొద్దంటూ క‌సురుకొని విసురుగా వెళ్లిపోయారు.

పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే.. మ‌హిళ‌గా నాకిచ్చిన గౌర‌వం ఇదేనా? అని బాధేసింది.  ఆ రోజు జ‌రిగింది త‌లుచుకుంటే ఇప్ప‌టికి ఏడుపొస్తుంది. తీవ్ర అంత‌ర్మ‌థ‌నం త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నా. పార్టీలో చేరిన స‌మ‌యంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. అమ్మా.. అంద‌రం క‌లిసి ప‌ని చేసుకుందాం.. ముందుకు వెళ‌దామ‌న్నారు. అలాంటి మాట‌లు జ‌గన్ నోటి నుంచి ఎప్పుడూ విన‌లేదు. జ‌గ‌న్ పార్టీలో లేనిది తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ది అప్పుడే అర్థ‌మైంద‌ని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు