మోడీ హిట్‌ పార్ములా ఫాలో అవుతున్న‌ కేటీఆర్‌

మోడీ హిట్‌ పార్ములా ఫాలో అవుతున్న‌ కేటీఆర్‌

గ‌త ఏడాది ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వ‌హించిన ఓ వినూత్న కార్య‌క్ర‌మం మీకు గుర్తుందా? అదేనండి...విదేశాల్లో ఉన్న టౌన్‌హాల్ సాంప్రదాయాన్ని మనదగ్గర ఆచరణలోకి తీసుకురావ‌డం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరికొత్త ఒరవడికి తెరతీశారు. పౌరులతో ప్ర‌ముఖులు ముఖాముఖి జరిపడ‌మే టౌన్‌హాల్ సమావేశం. ఈ కార్యక్రమం ద్వారా సదస్సుకు హాజరైన వ్యక్తులు, వక్తల మధ్య ప్రశ్న-సమాధానం రూపంలో సమావేశం కొనసాగుతుంది. మైగవ్.ఇన్ పోర్టల్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టౌన్‌హాల్ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మోడీజీ నిర్వ‌హించి...ప్ర‌జ‌ల సందేహాల‌ను నివృత్తి చేశారు. ప‌లు స‌మ‌స్య‌ల‌ను నోట్ చేసుకొని వాటికి ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌య‌త్నించారు.

ఇప్పుడు స‌రిగ్గా మంత్రి కేటీఆర్ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. హైద‌రాబాదీల నుంచి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు, అభిప్రాయాల‌ను స్వీక‌రించేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఇంచార్జీ మంత్రిగా ఉన్న రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి అయిన కేటీఆర్ ఈ క్ర‌మంలో వారివ‌ద్ద నుంచే అభిప్రాయాలు తెల‌సుకునేందుకు టౌన్ హాల్ స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌య్యారు. వచ్చే వారం నుంచి 'మన నగరం / అప్నా షెహర్' పేరుతో నగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. సో..ఆయా స‌ర్కిళ్ల వారీగా వెలువ‌డే షెడ్యూళ్ల‌ను అనుస‌రించి ప‌ర్జ‌లు, వివిధ సంఘాలు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించి వాటికి ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన‌ ప‌రిష్కారం సాధించుకోవాల‌న్న‌మాట‌.

అయితే ఇది మంత్రి కేటీఆర్‌కు మొద‌టిసారేం కాదు. బ‌ల్దియా ఎన్నిక‌ల్లో కారును విజ‌య‌తీరాల‌కు చేర్చేందుకు కేటీఆర్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని త‌న భుజాన వేసుకున్న మంత్రి టౌన్‌హాల్ స‌మావేశం రూపంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ అభివృద్ధికి సంబంధించిన స‌ల‌హాల‌ను గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ స్వీక‌రించారు. హైటెక్ సిటీలోని శిల్పారామంలో ఈ మేర‌కు టౌన్ హాల్ స‌మావేశం నిర్వ‌హించి అభిప్రాయాలు స్వీక‌రించారు. అనంత‌రం వాటిలో కొన్నింటినీ గ్రేట‌ర్‌లో అమ‌లు చేశారు. కాగా, అదే స‌మ‌యంలో న‌గ‌రానికి వ‌చ్చే మంచినీటి పైపులైను ప్రారంభోత్స‌వం చేయ‌డం, డ‌బుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాప‌న‌, ఇత‌ర‌ పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవ‌డం ఇలా బ‌హుపాత్ర‌ల్లో కేటీఆర్ బిజీబిజీగా మారిపోయిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు