ప్ర‌చారం కోరుకునే బాబు ఇంత‌గా మారిపోయారేంటో!

ప్ర‌చారం కోరుకునే బాబు ఇంత‌గా మారిపోయారేంటో!

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారానికి ఇచ్చే ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కార్య‌క్ర‌మం చిన్న‌దైనా...పెద్ద‌దైనా.. పార్టీ ప‌రంగా చేసింద‌యిన‌...ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన‌ది అయినా...బాబు ప్రచారంపై పెట్టే శ్ర‌ద్ధ మామూలుగా ఉండ‌ద‌ని ఆయ‌న గురించి ఏళ్లుగా తెలిసిన వారు ఓపెన్‌గా చెప్పేసే మాట‌! అందులోనూ తాను చెప్పిన మాటను అమ‌లుచేస్తే...ఇక ప‌బ్లిసిటీ మోత మోగిపోతుంద‌ని  చెప్తుంటారు. అయితే అలాంటి చంద్ర‌బాబు దాదాపుగా కోటిమందిని ప్ర‌భావితం చేసే నిర్ణ‌యం తీసుకున్నవిష‌యంలో సంబ‌రాలు వ‌ద్దంటున్నారు. ప్ర‌చారానికి నో చెప్తున్నారు. ఎందుకీ ఈ మార్పు అనేది ఇప్పుడు తెలుగుత‌మ్ముళ్ల‌లోనే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

ఇంత‌కీ బాబు తీసుకున్న అంత కీల‌క నిర్ణ‌యం ఏంటంటే...కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం. ఇన్నాళ్లు కాపుల నుంచి ఇదే విష‌యంలో తీవ్ర‌మైన అస‌హ‌నాన్ని ఎదుర్కున్న బాబు...ఎట్ట‌కేల‌కు మూడున్న‌రేళ్ల త‌ర్వాత త‌న ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకున్నారు. కాపుల‌కు బీసీ కేట‌గిరీలో 5 శాతం కోటా క‌ల్పించేందుకు ఇటు కేబినెట్ అటు అసెంబ్లీ తీర్మానం చేశారు. అయితే ప్ర‌చారం వ‌ద్ద‌ని పార్టీ నేత‌ల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కాపు రిజర్వేషన్ ప్రకటన అనంతర పరిణామాలపై బాబు సమీక్షించారు.ఈ సంద‌ర్భంగానే కాపు రిజర్వేషన్లను ఓకే చేసి కేంద్రానికి పంపించాం. దాన్ని సాధించుకుందాం. ఈలోపు సంబరాలు చేసుకుని మరొకరికి ఇబ్బంది కలిగించవద్దు. బీసీల వ్యవహారంపై ఆయా వర్గాలకు నచ్చచెప్పి వివరించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలి. మనం సమాజంలో వెనుకబడిన కులాలందరి పక్షాన ఉన్నాం. అన్ని కులాలు పేదరికం నుంచి బయటపడాలన్నదే మన సిద్ధాంతం. బీసీలు మన పార్టీకి పునాదిరాళ్లు. వారికి నచ్చచెప్పి వాస్తవాలు వివరించే బాధ్యత మీరే తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ మంత్రులను ఆదేశించారని తెలుస్తోంది.

మన పనులు మరొకరికి ఇబ్బందికరంగా, సమస్యలు తీసుకురాకుండా ఉండాలని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినందువల్ల బీసీలకు ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, కాపులకు వేరే కేటగిరిలో ఇచ్చినందున ఎవరూ ఆందోళన చెందవద్దన్న సంకేతాలిచ్చే బాధ్యత బీసీ మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించి, లోకేష్ పర్యవేక్షించాలని, టీడీ జనార్దన్ వీరందరితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ‘మనది బీసీల పార్టీ. మనకు బీసీలే పునాది. వాళ్లకు అన్యాయం జరిగే ఏ పనీ మనం చేయం. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వనందున బీసీల రాజకీయ ప్రయోజనాలకు వచ్చే ప్రమాదమేదీ ఉండదు. ఈ విషయాన్ని మీరు బీసీల వద్దకు తీసుకువెళ్లి, వారిని శాంతపరచాలి’ అని సూచించారు. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడిన పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రకటనల పైనా చర్చించారు. కాపు రిజర్వేషన్‌పై పార్టీలో అందరితో చర్చించిన తర్వాతే మేనిఫెస్టోలో పెట్టామని, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిదికాదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు