భోజ‌నం అంటూ.. టిఫిన్ పెడ‌తావా బాబు?

భోజ‌నం అంటూ.. టిఫిన్ పెడ‌తావా బాబు?

కాపు రిజ‌ర్వేష‌న్ల మీద కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం పెదవి విప్పారు. కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన  అనంత‌రం స్పందించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు ఎప్ప‌టికీ ఆమోద‌యోగ్యం కాద‌న్నారు.

తాము చేసిన ఉద్య‌మం వెనుక ప్ర‌ధాని మోడీ.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ ఉన్నార‌ని చెప్ప‌టం స‌రికాద‌న్నారు.  తెలుగు దేశం పార్టీ నేత‌లు ప‌లువురు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. ఇలాంటివి మానుకోవాల‌న్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండ‌ద‌న్న ముద్ర‌గ‌డ‌.. భోజ‌నం పెడ‌తాన‌ని చెప్పి టిఫిన్ పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
కాపుల రిజ‌ర్వేష‌న్ల‌ను తొమ్మిదో షెడ్యూల్ లో చేరిస్తేనే త‌మ‌కు దీపావ‌ళి పండుగ అని చెప్పిన ఆయ‌న‌.. ఏపీలో కాపులు కోటి మంది ఉంటే 50 ల‌క్ష‌ల మందినే చూపించార‌ని త‌ప్పు ప‌ట్టారు. త‌మ జాతి వాళ్ల‌కు స‌రైన స‌మాచారం అంద‌ని కార‌ణంగా కానీ.. గ్రామాల్లో లేని కార‌ణంగా కానీ వివ‌రాలు అందించ‌లేక‌పోయి ఉంటార‌ని.. త‌మ జాతి వాళ్లు రాష్ట్రంలో ఎంత‌మంది ఉంటార‌న్న‌ది అంద‌రికి తెలిసిందేన‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌టంలో చంద్ర‌బాబు ఫెయిల్ అయ్యార‌న్నారు. ముస్లింలు.. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విష‌యంలో కేసీఆర్ ఎవ‌రూ అడ‌గ‌కుండా.. కోర‌కుండానే అసెంబ్లీలో తీర్మానం చేసిన తీరులో చంద్ర‌బాబు చేయ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి నాలుగేళ్ల వ‌ర‌కూ అమ‌లు చేయ‌లేద‌ని.. తాము ఉద్య‌మం చేసి ఒత్తిడి తెచ్చిన త‌ర్వాతే కాపు రిజ‌ర్వేష‌న్ల మీద ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చింద‌న్నారు.

కాపులు ఏపీలో  కోటి మంది జ‌నాభా ఉంటే 50 ల‌క్ష‌ల‌కు ప‌రిమితం చేస్తూ ప‌ల్స్ స‌ర్వేలో చూపించ‌టం స‌రికాద‌న్నారు. కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ల‌ను పోరాడి సాధించుకున్నార‌న్నారు. భోజ‌నం టైం వ‌చ్చిన‌ప్పుడు భోజ‌నం పెట్టాల్సింది పోయి టిఫిన్ కాద‌న్న ఆయ‌న‌.. రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడిన త‌న‌పైనా.. త‌న క్యారెక్ట‌ర్ ను దెబ్బ తీసేలా నేత‌లు వ్య‌వ‌హ‌రించార‌న్నారు.

తెలుగుదేశం పార్టీలో తాను మంత్రిగా ప‌ని చేశాన‌ని.. త‌ర్వాతి కాలంలో చంద్రబాబు ఆహ్వానిస్తే ఎంపీగా పోటీ చేశాన‌ని.. ఏ రోజు డ‌బ్బులు కావాల‌ని కానీ.. ఏదైనా ఫేవ‌ర్ చేయాల‌ని కానీ తాను అడిగింది ఉందా? అని ప్ర‌శ్నించారు.
కాపు ఉద్య‌మం వెనుక జ‌గ‌న్ ఉన్నారు.. ఆయ‌న నిధులు స‌మ‌కూరుస్తున్నారంటూ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 1999లో ఎంపీగా పోటీ చేసిన స‌మ‌యంలో ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం రూ.8ల‌క్ష‌లు మీరు పంపిన‌వి త‌ప్పించి ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ళ్లీ ఏదైనా సాయం ఆశించారా? అంటూ ప్ర‌శ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు