జ‌గ‌న్‌ను అడ్డంగా బుక్ చేసిన బాబు

జ‌గ‌న్‌ను అడ్డంగా బుక్ చేసిన బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సారథి వైఎస్ జ‌గ‌న్‌కు భారీ డ్యామేజీ చేసింద‌ని అంటున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో జ‌నంలోకి వెళ్లి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ముప్పుతిప్ప‌లు పెట్టాల‌ని చూసిన విప‌క్ష‌నేత జ‌గ‌న్‌...ఇప్పుడు అదే పాద‌యాత్ర‌లో ఇబ్బందులు ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇందుకు బాబు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణ‌మ‌ని చెప్తున్నారు. ఇంత‌కీ ఇదంతా..దేని గురించి అంటే.... కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజ‌ర్వేష‌న్‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓకే చెప్పేయ‌డ‌మే!

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు మంజునాథ క‌మిష‌న్‌ను నియ‌మించి ఆ క‌మిష‌న్ నిర్ణ‌యం అనుస‌రించి  కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం చంద్ర‌బాబు ఓకే చెప్పారు. బీసీ-ఎఫ్ కోటా కింద ఈ రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామం వైఎస్ జ‌గ‌న్‌కు క‌క్క‌లేక‌ మింగలేక అన్న‌ స్థితికి చేర్చిందంటున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశంపై బీసీలు ఇప్ప‌టికే భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కాపుల‌కు మ‌ద్ద‌తు ఇస్తే...వైసీపీకి బీసీలు దూర‌మ‌వ‌డం ఖాయం. పోనీ కాపుల‌ను కాద‌ని అంటే...కీల‌క‌మైన వ‌ర్గాన్ని దూరం చేసుకోవ‌డ‌మే. అలాగ‌ని బీసీల ఓట్లు గంప‌గుత్తగా ప‌డుతాయా అంటే అదీ న‌మ్మ‌కం లేదు.

ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే పాద‌యాత్ర సంద‌ర్భంగా స‌హ‌జంగానే మ‌ద్ద‌తు కోరుతూ కాపులు, కోటాను వ్య‌తిరేకించాల‌ని కోరుతూ బీసీలు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్నార‌ని..ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. త‌ద్వారా ఏ పాద‌యాత్ర కేంద్రంగా అయితే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ త‌న‌ను ఇరకాటంలో ప‌డేయాల‌ని చూశాడో...అదే యాత్రలో జ‌గ‌న్ బుక్‌ అయ్యేలా చంద్ర‌బాబు చేశార‌ని అంటున్నారు.

మ‌రోవైపు సీమ‌లో కీల‌కంగా ఉన్న తెలగ, బ‌లిజ‌, ఒంట‌రి కులాలు తాజా రిజ‌ర్వేష‌న్‌ను వైఎస్ జ‌గ‌న్ వ్య‌తిరేకిస్తే...వైసీపీకి దూర‌మ‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే, రిజ‌ర్వేష‌న్లు వ్య‌తిరేకించ‌మ‌ని ఎమ్మెల్యేల మీద బీసీల సంఘాల‌ నుంచి ఒత్తిడి మాత్రం పెరుగుతోంది . ఇంకో వైపు క‌నీసం 20 నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌భావిత స్థాయిలో ఓట్లున్న బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చిన చంద్ర‌బాబు... వైసీపీకి సీమ‌లో కూడా దెబ్బేశారు. బోయ‌లు ఇపుడు ఎంత ఖుషీగా ఉన్నారంటే... భ‌విష్య‌త్తులో ఇక ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల్లో మాకు తిరుగుండ‌దు అని ఫీల‌వుతున్నారు. ఒక్క నిర్ణ‌యంతో బాబుకు వాళ్లంతా ఫిదా అయిపోయారు. దీంతో వైఎస్ జ‌గ‌న్ ఈ కోటాను కాదన‌లేరు. అవున‌నలేరు. వైసీపీ వైపు ఉన్న బోయ‌లు కూడా విశ్వాసాన్ని మార్చుకొని అధికార టీడీపీ వైపు మొగ్గుచూపుతారని...త‌ద్వారా జ‌గ‌న్‌కు ప‌ట్టున్న సీమ‌లోనే ఆయ‌న్ను దెబ్బ‌తీసిన‌ట్లు అవుతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు