ఆంధ్ర‌జ్యోతి ఎండీకి స‌గం విష‌య‌మే తెలుసా?

ఆంధ్ర‌జ్యోతి ఎండీకి స‌గం విష‌య‌మే తెలుసా?

కాలానికి త‌గ్గ‌ట్లే మీడియాలోనూ లెక్క‌లు చాలానే మారిపోయాయి. గ‌తంలో ప్ర‌జ‌ల‌కు కొత్త విష‌యాలు చెప్పాలి.. అధికార ఐరెన్ క‌ర్ట‌న్ వెనుక ఉండిపోయే స‌త్యాల్ని బ‌య‌ట‌కు చెప్ప‌ట‌మే లక్ష్యంగా.. క‌ష్ట‌న‌ష్టాల‌కు ఎదురొడ్డి మ‌రీ మీడియా సంస్థ‌ల్ని నిర్వ‌హించేవారు. ఇప్పుడంత క‌ష్టానికి చాలామంది మీడియా అధిప‌తులు సిద్ధంగా లేరు.

ప‌వ‌ర్ ఉన్నోడి ప‌క్క‌న ఉండ‌టం ద్వారా ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందుల్ని త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. ఇందుకు.. చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ఎవ‌రికి వారు ఏదో ఒక పేరుతో అధికార‌ప‌క్షానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కనిపిస్తుంది. ఒక‌ప్పుడు మీడియా సంస్థ‌ల అధిప‌తులు రాజ‌కీయ నేత‌ల‌తో న‌డిపే సంబంధాలు చాలా సున్నితంగా ఉండేవి. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌టం.. త‌మ‌ను ప‌లుక‌రించ‌టానికి సైతం ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునేలా ఉండేవారు.

వీలైనంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌ప్ర‌పంచానికి రాకుండా..త‌మ‌కున్న రిపోర్టింగ్ వ్య‌వ‌స్థ‌తోనే బండి న‌డిపించేవారు. లాభాల్ని ఆశించ‌కుండా ఉండ‌డ‌టంతో పాటు.. మీడియా సంస్థ నిర్వ‌హ‌ణ అన్న‌ది ఒక బాధ్య‌త‌గా చేసే వారు త‌ప్పించి.. అదో లాభాలు పూయించే సంస్థ‌గానో.. త‌మ‌దో ప‌వ‌ర్ స్టేష‌న్ గానో చూసేవారు కాదు.

కానీ.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లే మీడియా సంస్థ‌ల ప్రాధామ్యాలు మారాయి. మీడియా అధిప‌తుల ల‌క్ష్యాల్లోనూ మార్పు వ‌చ్చేసింది. అదే.. రాజ‌కీయనేత‌లు మీడియ సంస్థ‌ల్ని ప్ర‌భావితం చేయ‌టం మొద‌లుపెట్టారు. మీడియా సంస్థ‌ల అధిప‌తులు త‌మ‌కు తామే రిపోర్టింగ్ చేసే వ‌ర‌కూ వెళ్లిన‌ప్పుడు. అబ్లిగేష‌న్ల పేరుతో ఎన్నిర‌కాలు వంగాలో అన్ని రకాలుగా వంగేస్తున్న వైనం మీడియా వ‌ర్గాల్లో త‌ర‌చూ చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంటుంది.

మీడియా ముచ్చ‌ట్ల‌ను ప‌క్క‌న పెడితే.. ద‌మ్మున్న మీడియా సంస్థ‌గా చెప్పుకునే ఆంధ్ర‌జ్యోతి మీడియా సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ‌కు ఒక మంచి అల‌వాటు ఉంది. ప్ర‌తి వారం త‌న ప‌త్రిక నాలుగో పేజీలో ఆ వారానికి సంబంధించిన రాజ‌కీయ విశ్లేష‌ణ‌ను త‌న‌దైన శైలిలో వినిపిస్తూ ఉంటారు. ఒక మీడియా సంస్థ అధినేత‌. స్వ‌యంగా రాజ‌కీయాన్ని విశ్లేషించ‌టం.. త‌న‌కు అందిన స‌మాచారాన్ని అవ‌స‌ర‌మైన మేర‌కు పాఠ‌కుల‌కు చేర్చే ప్ర‌య‌త్నం ప‌లువురిని ఆక‌ర్షిస్తుంటుంది. తాజాగా ఆయ‌న రాసిన కొత్త ప‌లుకులో ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను ప్ర‌స్తావించారు.

హైద‌రాబాద్ మెట్రో.. జీఈఎస్ స‌ద‌స్సుల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన మోడీ.. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ప‌లు సంద‌ర్భాల్లో క‌లిశారు. హైద‌రాబాద్ లో మోడీ గ‌డిపిన ఎనిమిది తొమ్మిది గంట‌ల్లో ప‌లు వేదిక‌ల మీద ప్ర‌ధాని.. ముఖ్య‌మంత్రి క‌లిసి ఉండ‌టం క‌నిపిస్తుంది. తాను ప్ర‌ధాని మోడీని క‌లిసిన ప్ర‌తిసారీ.. ఆయ‌న‌కు బోలెడ‌న్ని స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు చెబుతుంటారు కేసీఆర్‌. త‌న మాట‌ల‌కు మోడీ బాగా స్పందిస్తార‌ని చెప్ప‌టం క‌నిపిస్తుంది. మ‌రి.. అంత క్లోజ్ గా ఉంటార‌ని చెప్పే  మోడీ.. త‌న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ తో కులాసాగా మాట‌లు చెప్ప‌టం ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా ఇద్ద‌రు నేత‌లు ముబావంగా ఉండ‌టం అంద‌రూ టీవీల్లో చూసిందే.

తాను ఇచ్చే ఐడియాల‌తో మోడీ ఫిదా అయ్యార‌ని చెప్పే కేసీఆర్‌.. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని ప‌క్క‌న ఎందుకు కూర్చోలేద‌న్న‌దిచిన్న సందేహానికి స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. అంతేకాదు.. మెట్రోరైల్లో మోడీ ప‌క్క‌న మంత్రి కేటీఆర్ కూర్చున్నారే కానీ కేసీఆర్ కూర్చోలేదు. ఈ విష‌యాల్ని ప్ర‌స్తావిస్తూ.. ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే చేసిన విశ్లేష‌ణ ఏమిటంటే.. జాతీయ స్థాయిలో యాంటీ బీజీపీ కూట‌మిని ఏర్పాటు చేయ‌టానికి కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఆ విష‌యం తెలిసే మోడీ కేసీఆర్‌తో ముభావంగా ఉన్న‌ట్లుగా రాసుకొచ్చారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంద‌నుకుందాం.

మ‌రి.. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన విందు స‌మ‌యంలో ఫ‌ల‌క్ నుమా ఫ్యాలెస్ లో ఇరువురు ముఖ్య‌నేత‌లు ఏకాంతంగా చాలాసేపు మాట్లాడుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదెలా అన్న దానికి ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం లేదు. పొద్దునంత ముభావంగా ఉన్న మోడీ.. కేసీఆర్ లు రాత్రి అయ్యేస‌రికి మాత్రం విడిగా మాట్లాడుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ విష‌యాన్ని ఆర్కే త‌న విశ్లేష‌ణ‌లో ప్ర‌స్తావిస్తార‌ని అనుకున్నోళ్ల‌కు నిరాశే  మిగిలింది. అన్నింటికి మించి మంగ‌ళ‌వారం రాత్రి (న‌వంబ‌రు 28) వేళ మోడీ.. కేసీఆర్ లు మాట్లాడుకోలేద‌న్న‌ట్లుగా అస‌లు ఆ విష‌యాన్నే ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఆర్కే కొత్త ప‌లుకు మాట‌లు చూస్తుంటే.. మోడీ.. కేసీఆర్ మ‌ధ్య మాట‌ల ముచ్చ‌ట ఆర్కే దృష్టికి వెళ్ల‌లేదా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు