బీజేపీ నేత‌ల మైండ్ బ్లాంక్ చేస్తున్న బాబు

బీజేపీ నేత‌ల మైండ్ బ్లాంక్ చేస్తున్న బాబు

రాజ‌కీయ చ‌తురుడనే పేరున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు వేసే స్కెచ్చుల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఇరకాటంలో ప‌డే సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న తీసుకున్న మిత్ర‌ప‌క్షాల నేత‌ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన‌ట్లు ఉంద‌ని అంటున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ పేరుతో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని అడ్డంగా బుక్ చేశార‌ని చెప్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో మైలేజ్ వ‌స్తే బాబుకు లాభం..రాక‌పోతే బీజేపీకి న‌ష్టం అన్న‌ట్లుగా చంద్ర‌బాబు నిర్ణ‌యం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్  హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ హామీ నిలుపుకోవ‌డం విష‌యంలో దాదాపు మూడున్న‌రేళ్లు జాప్యం చేశారు. గత ఎన్నికల్లో కాపువర్గాలు కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బాబు ఇచ్చిన హామీ, పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాయి. తర్వాత 9 నెలలైనప్పటికీ దానిపై కదలిక లేకపోవడంతో ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు. తునిలో భారీ సభ నిర్వహించిన సందర్భంలో అది హింసాత్మకంగా మారింది. అందులో పాల్గొన్నారన్న అనుమానంతో పోలీసులు 13 జిల్లాల్లోని కాపు యువకులకు పోలీసుస్టేషన్లకు పిలిపించి హింసించడం, కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన ముద్రగడ, దీక్షలకు సిద్ధం కావడంతో టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత మొదలయింది. ముద్రగడ అరెస్టుతో వ్యతిరేకత మరింత పెరిగింది. ముద్రగడ ఉద్యమానికి అటు వైసీపీ కూడా బహిరంగ మద్దతు ప్రకటించింది. ముద్రగడ దీక్ష వల్ల ఆయన ఇమేజ్ పెరగకపోయినా, కాపు యువతను బాబు వ్యతిరేకదారిలో మళ్లించడంలో మాత్రం ముద్రగడ విజయం సాధించారు. ఆ వ్యతిరేకతను తగ్గించడానికి బాబు కాపు మంత్రులు, నేతలను ముద్రగడపై ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఈ ఎత్తులు పై ఎత్తుల‌కు చెక్ పెడుతూ సీఎం చంద్ర‌బాబు కాపు కోటాకు మోక్షం క‌ల్పించారు

అయితే ఇక్క‌డే బాబు త‌న‌దైన శైలిలో వ్యూహం ప‌న్నార‌ని అంటున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన చంద్ర‌బాబు ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యతను నేర్పుగా కేంద్రంలో ఉన్న‌ బీజేపీపైనే పెట్టారు. త‌ద్వారా ఇక‌ నుంచి కాపుల రిజర్వేషన్ చట్టబద్ధతపై ఎవరు మాట్లాడినా, ముందు బీజేపీని నిలదీసే పరిస్థితి కల్పించారు. తాము కాపుల కోసం రిజర్వేషన్ కల్పించామని, దానికి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రమే కాబట్టి, అంతా కలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని లౌక్యంగా చెప్పి తప్పించుకుని, బీజేపీని తెరపైకి తీసుకువచ్చే చాణక్యమే ఈ వ్యూహంలో కనిపిస్తోంది.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా.. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు తీర్చడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీనీ బాబు ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ఇరికించారు. ప్ర‌స్తుత ఎపిసోడ్‌లో కాపు కోటాకు మ‌ద్ద‌తిస్తే...బిల్లుకు ఆమోదం క‌ల్పిస్తే...మైలేజీ టీడీపీకి వ‌స్తుంది. ఒక‌వేళ బీజేపీ ఈ విష‌యాన్ని నాన్చినా... లేదా నో చెప్పినా ఆ పార్టీకే మైన‌స్ అవుతుంది. అంటే లాభం బాబు ఖాతాలోకి...న‌ష్టం బీజేపీకి అన్నమాట‌. ఇటు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కాపాడుకుంటూనే ఇటీవ‌లి కాలంలో త‌న‌కు స‌హ‌క‌రించ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీని బాబు దెబ్బ‌తీశాడ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు