వాట్సాప్ అడ్మిన్ల‌కు మ‌రింత `ప‌వ‌ర్`!

వాట్సాప్ అడ్మిన్ల‌కు మ‌రింత `ప‌వ‌ర్`!

ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో స‌గ‌టు మాన‌వుడి నిత్య‌జీవితంలో వాట్సాప్ ఒక భాగ‌మైందంటే అతిశ‌యోక్తి కాదు. విద్య‌, ఉద్యోగం, వ్యాపారం, వ్య‌క్తిగ‌తం....కేట‌గిరీ ఏదైనా సంబంధిత స‌మాచారాన్ని కావాల్సిన వారికి చిటికెలో చేర‌వేసే ఈ యాప్ న‌కు కోట్లాదిమంది యూజ‌ర్లున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 భాష‌ల‌లో, దేశవ్యాప్తంగా 10 భాష‌ల‌లో యూజ‌ర్ల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందించేందుకు వాట్సాప్ ఎప్ప‌టిక‌పుడు అప్ డేట్స్ ను ప్ర‌వేశ‌పెడుతుంది. గ‌త వెర్ష‌న్ల‌లో ఉన్న లోటుపాట్ల‌ను స‌రిచేయ‌డ‌మే కాకుండా స‌రికొత్త ఫీచ‌ర్స్ తో లేటెస్ట్ వెర్ష‌న్స్ ను అందిస్తుంది. త్వ‌ర‌లోనే వాట్సాప్‌ గ్రూప్ అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు మ‌రిన్ని అధికారాల‌ను, హ‌క్కుల‌ను క‌ల్పించేందుకు సోష‌ల్ మీడియా దిగ్గ‌జం సిద్ధ‌మైంది. తాజాగా, సరికొత్త ఫీచ‌ర్స్ ను 2.17.430 వెర్ష‌న్ లో యాండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లంద‌రికీ అప్ డేట్ చేసేందుకు వాట్సాప్ సంస్థ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే  యూజ‌ర్లంద‌రికీ పూర్తి స్థాయిలో ఈ ఫీచ‌ర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. `వాబీటా ఇన్ఫో వెబ్ సైట్` ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. అయితే, ఈ ఫీచ‌ర్స్ గురించి వాట్సాప్ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

కొన్ని నిర్దేశిత ల‌క్ష్యాల‌తో, ఉద్దేశ్యాల‌తో గ్రూపుల‌ను అడ్మిన్ లు క్రియేట్ చేస్తారు. ఆయా గ్రూపు ఉద్దేశ్యాల‌కు త‌గిన‌ట్లుగా స‌భ్యుల‌ను గ్రూపులో యాడ్ చేస్తారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఆయా గ్రూపుల‌లోని కొంద‌రు స‌భ్యులు..... గ్రూపు క్రియేట్ చేసిన ప్ర‌ధాన ఉద్దేశ్యాన్ని విస్మరించి త‌మ‌కు న‌చ్చిన‌, తాము మెచ్చిన పోస్టుల‌ను గ్రూపులో య‌థేచ్ఛ‌గా పోస్ట్ చేస్తుంటారు. ఆ అన‌వ‌స‌ర పోస్టుల ప్ర‌భంజ‌నంలో గ్రూపున‌కు సంబంధించి అడ్మిన్ చేసే విలువైన పోస్టులు, స‌మాచారాన్ని మిగ‌తా స‌భ్యులు కోల్పోవాల్సి వ‌స్తుంది. అటువంటి `ఇబ్బందిక‌ర‌` స‌భ్యుల‌ను తొల‌గించ‌లేక‌, వారి పోస్టుల‌ను భ‌రించ‌లేక స‌ద‌రు గ్రూపు అడ్మిన్ లు స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అటువంటి స‌భ్యుల‌ను నియంత్రించే అధికారాలను, హ‌క్కుల‌ను అడ్మిన్ కు క‌ట్ట‌బెడుతూ వాట్సాప్ ఈ స‌రికొత్త ఫీచ‌ర్‌ ను త్వ‌ర‌లో ప్ర‌వేశపెట్ట‌బోతోంద‌ని స‌మాచారం. 'రెస్ట్రిక్టెడ్ గ్రూప్స్' పేరుతో ఈ ఫీచ‌ర్ ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్ సాయంతో గ్రూపులో `ఇబ్బందిక‌ర‌` పోస్టులు, ఇమేజ్‌లు, వీడియోలు పెడుతున్న స‌భ్యుల‌ను అడ్మిన్  క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. అడ్మిన్ రెస్ట్రిక్ట్ చేసిన స‌భ్యులకు కేవ‌లం గ్రూప్ లో వ‌చ్చే మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలను చూసే అవ‌కాశం మాత్ర‌మే ఉంటుంది. వాటిపై `ఇబ్బందిక‌ర‌`స‌భ్యులు స్పందించే అవ‌కాశాన్ని అడ్మిన్ నియంత్రిస్తాడు. ఒకవేళ నియంత్ర‌ణ‌కు గురైన స‌భ్యులు ఏదైనా పోస్టు పెట్టాల‌నుకుంటే 'మెసేజ్ అడ్మిన్‌' అనే ఆప్ష‌న్‌ ద్వారా అడ్మిన్‌ని సంప్ర‌దించాల్సి ఉంటుంది లేదా గ్రూప్ నోటిఫికేష‌న్స్ ను మ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారి మెసేజ్ ని అడ్మిన్ చూసి ఆమోదిస్తేనే గ్రూప్ లో పోస్ట్ అవుతుంది. టెస్టింగ్ ద‌శ‌లో 72 గంట‌లపాటు అటువంటి స‌భ్యుల‌ను అడ్మిన్ నియంత్రించే `ప‌వ‌ర్‌` ను వాట్సాప్ క‌ల్పించింది. అయితే, ఆ స‌మయాన్ని మ‌రింత పెంచే యోచ‌న‌లో వాట్సాప్ ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్ అంద‌రు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. అడ్మిన్ల చేతికి ఈ ఫీచ‌ర్ `బ్ర‌హ్మాస్త్రం` వంటిద‌ని ప‌లువురు టెక్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు