మోడీతో డీల్ ఎంత దండ‌గ‌మారంటే..?

మోడీతో డీల్ ఎంత దండ‌గ‌మారంటే..?

ఆవేశం వ‌చ్చిన‌ప్పుడు అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. తాజాగా అలాంటిదే జ‌రిగింది. మోడీ స‌ర్కారుపై మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆచితూచి మాట్లాడ‌తారు. ఏపీకి ఎంత న‌ష్టం వాటిల్లుతున్నా ఆయ‌న కంట్రోల్ త‌ప్ప‌రు. అదే స‌మ‌యంలో నిజాల్ని చెప్ప‌రు. తాజాగా మాత్రం బాబుకు ఎక్క‌డో కాలిపోయింది.

కోటి ఆశ‌లు పెట్టుకొని.. 2019 ఎన్నిక‌ల‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిని చూపించ‌కున్నా.. పోల‌వ‌రం ప్రాజెక్టును చూపించ‌టం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టాల‌నుకున్న ప్లాన్ ను దెబ్బేసేలా ఢిల్లీలోని మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌టంతో బాబు స‌ర్కారు కిందామీదా ప‌డుతోంది. మోడీ స‌ర్కారు ఇచ్చిన షాకులో మాట్లాడిన బాబు నోటి నుంచి క‌ఠిన‌మైన వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ రాజ‌ధానిని ఢిల్లీకి మించి నిర్మిస్తాన‌ని సార్వ‌త్రిక ఎన్నిక వేళ క‌డుపు నిండేలా మాట‌లు చెప్పిన మోడీ.. వాస్త‌వంలో మాత్రం అలాంటిదేమీ చేయ‌లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. పోల‌వ‌రంపై కేంద్రం ఇస్తున్న పంచ్ ల నేప‌థ్యంలో ఆవేద‌న‌తో బ‌ర‌స్ట్ అయిన చంద్ర‌బాబు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

విబ‌జ‌న త‌ర్వాత తాను ఏపీ రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో 62సార్లు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోడీతో స‌హా కేంద్ర మంత్రుల్ని క‌లిసి ప‌లుమార్లు వారి దృష్టికి స‌మ‌స్య‌ల్ని తీసుకెళ్లిన‌ప్ప‌టికీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి.. అందునా రాజ‌ధాని ఖాతాకు వ‌చ్చింది కేవ‌లం రూ.2500 కోట్లు మాత్ర‌మేన‌ని చెప్పారు. మ‌రో రూ.వెయ్యి కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇక‌.. కేంద్ర సంస్థ‌ల కోసం రాష్ట్ర స‌ర్కారు 2911 ఎక‌రాల్ని ఇచ్చిన‌ట్లు చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం ఏపీకి వ‌చ్చింది రూ.2500 కోట్లు మాత్ర‌మేన‌న్న మాట‌లోనే కేంద్రం ఏపీ ప‌ట్ల ఎంత నిరాద‌ర‌ణ ప్ర‌ద‌ర్శిస్తుందో అర్థ‌మవుతుంది. హైద‌రాబాద్ లాంటి రాజ‌ధాని న‌గ‌రాన్ని కోల్పోయిన ఏపీ ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని నిర్మాణ ఖాతాకు ల‌భించింది రూ.3500 కోట్లు అంటేనే.. విభ‌జ‌న‌తో ఏపీకి ఎంత న‌ష్టం వాటిల్లిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు