కొత్త పాత్ర‌లో అద‌ర‌గొట్టిన కేటీఆర్‌

కొత్త పాత్ర‌లో అద‌ర‌గొట్టిన కేటీఆర్‌

చురుకుద‌నం.. స‌మ‌ర్థ‌త‌.. క‌లుపుగోలుత‌నం..చొచ్చుకుపోవ‌టం లాంటివి రాజకీయ నేత‌ల‌కు కామ‌నే. కాకపోతే.. అవ‌న్నీ క‌ల‌బోసి ఉండ‌టం.. విష‌యాల మీద సాధికార‌త ఉండ‌టం చాలా త‌క్కువ మంది నేత‌ల్లో క‌నిపిస్తుంది. అన‌ర్గ‌ళంగా మాట్లాడే నేత‌లు సైతం.. వృత్తి నైపుణ్యంతో ఉన్న ప్ర‌ముఖుల‌తో మాట్లాడేట‌ప్పుడు తేలిపోతుంటారు. వీలైనంత వ‌ర‌కూ అలాంటి వాటి జోలికి పోరు.
కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు భిన్నం. హైద‌రాబాద్ లో తాజాగా జ‌రుగుతున్న జీఈఎస్ స‌ద‌స్సు ముచ్చ‌టే చూస్తే.. ఈ రోజు కేటీఆర్ స‌రికొత్త పాత్ర‌ను పోషించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై ప్లీన‌రీ జ‌రిగింది.

దీనికి హాజ‌రైంది ఎవ‌రంటే.. ట్రంప్ కుమార్తె ఇవాంక‌.. బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ స‌తీమ‌ణి చెర్రీ బ్లెయిర్‌.. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చండా కొచ్చ‌ర్‌.. డెల్ సీఈవో క్వింటోస్ లు వేదిక మీద ఉన్నారు. వీరు కాకుండా స‌భ‌కు వంద‌లాది మంది నిపుణులు హాజ‌ర‌య్యారు. ఇలాంటి వేదిక మీద మాట్లాడేట‌ప్పుడు విష‌యం ఏమాత్రం త‌క్కువ‌గా ఉన్నా ప‌లుచ‌న కావ‌ట‌మే కాదు.. అభాసుపాలు కావ‌టం ఖాయం. అలాంటి విష‌మ ప‌రీక్ష‌ను చాలా సులువుగా.. తాను నిత్యం చేస్తాన‌న్న‌ట్లుగా చేసి చూపించి అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్న‌రు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.

కీల‌క అంశంపై దాదాపు గంట‌కు పైనే సాగిన స‌ద‌స్సుకు మెంటార్ (స‌మ‌న్వ‌య‌క‌ర్త‌) పాత్ర‌ను పోషించిన ఆయ‌న‌.. త‌న పాత్ర‌కు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఏ సంద‌ర్భంలోనూ త‌డ‌బాటు ప‌డ‌క‌పోవ‌టం.. విష‌యం నుంచి డీవియేట్ కాక‌పోవ‌టం.. వేదిక మీద ఉన్న వారి స్థాయిలో మాట్లాడిన కేటీఆర్‌.. స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో నిత్యం రొచ్చు రాజ‌కీయం చేసే నేత‌ల్లోనూ ఎంత టాలెంట్ ఉంటుంద‌న్న భావ‌న క‌లిగేలా మంత్రి కేటీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. జీఈఎస్ స‌ద‌స్సు ఎవ‌రికి ఎంత లాభం చేస్తుంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మంత్రి కేటీఆర్ కు మాత్రం భారీ పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు.. ఆయ‌న స‌మ‌ర్థ‌త‌పై మ‌రింత న‌మ్మ‌కం క‌లిగేలా చేస్తుంద‌ని చెప్పాలి. ఉద్య‌మ రాజ‌కీయాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి నుంచి ఈ త‌ర‌హా స‌మ‌ర్థ‌తను పారిశ్రామిక‌వేత్త‌లు గుర్తించ‌క మాన‌దు.