ఆ సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న యాక్సిడెంట్‌

ఆ సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న యాక్సిడెంట్‌

ఇవాల్టి రోజున నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జ‌రుగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ దానికి చెక్ పెట్టేలా చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు ప్ర‌భుత్వాలు. కొన్నిచోట్ల ప్ర‌ముఖుల పిల్ల‌లు రోడ్డు ప్ర‌మాదాల్లో మృతి చెందిన‌ప్పుడు నాలుగు రోజులు హ‌డావుడి చేయ‌టం.. రోడ్డు భ‌ద్ర‌త‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్ప‌టం మిన‌హా పెద్ద‌గా చేసిందేమీ లేదు.

దీన్ని ప‌క్క‌న పెడితే.. ఏ మాత్రం సంబంధం లేని ఒక రోడ్డు ప్రమాదం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి చుక్క‌లు చూపిస్తోంది. నిత్యం ఎన్నో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా.. ఎప్పుడూ లేని రీతిలో వ్య‌క్త‌మ‌వుతున్న నిర‌స‌న‌తో ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంత‌కీ.. ఆ రోడ్డు ప్ర‌మాదం ఏమిటి? ఎందుకంత ఇబ్బందుల్లో ప‌డ్డారు? అన్న విష‌యాల్లోకి వెళితే..

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరుకు చెందిన 30 ఏళ్ల ర‌ఘుప‌తి కంద‌స్వామి అమెరికాలో ఐటీ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్నాడు. పెళ్లి చూపుల కోసం భార‌త్‌కు వ‌చ్చారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక్క‌డే మొత్తంగా మారిపోయింది. విధి వ‌క్రీక‌రించి.. బైక్ మీద వెళుతున్న ర‌ఘు మీద‌.. రోడ్డు ప‌క్క‌న ఏర్పాటు చేసిన అధికార‌పార్టీ (అన్నాడీఎంకే)కు చెందిన హోర్డింగ్‌ను  ఢీ కొన్నాడు. కింద ప‌డిన అత‌ను పైకి లేచే లోప‌ల వెనుక నుంచి వ‌చ్చిన ఒక ట్ర‌క్కు అత‌డిపై నుంచి వెళ్లిపోవ‌టం అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు.
ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించ‌టమే కాదు.. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైంది. అనుమ‌తి లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పార్టీ నేత‌లు హోర్డింగులు పెట్ట‌టం వ‌ల్ల‌నే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయంటూ అక్క‌డి స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన కొన్ని గంట‌ల త‌ర్వాత కొంద‌రు వ్య‌క్తులు ర‌ఘు చ‌నిపోయిన ప్లేస్ లో ర‌ఘును చంపిందెవ‌రు? అంటూ రోడ్ల మీద పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో రాశారు.

ఇవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన అన్నాడీఎంకే పార్టీ హోర్డింగ్ మీద తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టైం చూసుకొని దిగిన విప‌క్షం సైతం ఈ ప్ర‌మాదానికి బాధ్య‌త వ‌హిస్తూ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఈ హోర్డింగ్ ఎందుకు ఏర్పాటు చేశార‌న్న విష‌యాన్ని చూస్తే.. ఎంజీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్సవాలను పుర‌స్క‌రించుకొని ఏర్పాటు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాలంటూ చేస్తున్న నిర‌స‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఇది ఇప్పుడు ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English