తెలుగులో మోడీ ప్ర‌సంగం...కేసీఆర్‌కు న‌చ్చ‌నిమాటతో ముగింపు

తెలుగులో మోడీ ప్ర‌సంగం...కేసీఆర్‌కు న‌చ్చ‌నిమాటతో ముగింపు

హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్స‌వం, గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు న‌గ‌రానికి వ‌చ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు గ‌డ్డ‌పై ఆస‌క్తిక‌ర‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌సంగం చేశారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీజేపీ నేతలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. మెడీ మాస్క్ తో విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తెలుగులో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వెళ్ల‌డానికి ముందుగా బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. `సోదర సోదరీ మణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్‌కు రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తు వస్తారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు ఈ వీర్‌భూమి నుంచి ప్రణామాలు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు జోహర్లు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది` అని తెలుగులో మోడీ ప్రసంగించారు.

కాగా,రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రికి ఆహ్వానం ప‌లికిన కేసీఆర్‌కు న‌చ్చ‌ని పాయింట్‌ను ప్ర‌ధాని లేవ‌నెత్తార‌ని అంటున్నారు. . హైద‌రాబాద్ అంటే స‌ర్ధార్ ప‌టేల్ గుర్తుకు వ‌స్తార‌ని చెప్పారు. హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్ లో క‌లిపిన పేటేల్ కు ఈ వీర్ భూమి నుంచి ప్ర‌ణ‌విల్లుతున్నాన‌ని అన్నారు. కాగా, ప‌టేల్ నిజాం న‌వాబును భార‌త‌దేశంలో విలీనం చేసి హైద‌రాబాద్ సంస్థానానికి విముక్తి క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే విలీన దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని బీజేపీ పోరాటం చేస్తుండ‌గా...కేసీఆర్ అందుకు స‌సేమిరా అంటున్నారు. మ‌రోవైపు నిజాంను పొగిడే...ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మోడీ కేసీఆర్ ఆహ్వానం అందుకొని వ‌చ్చి...ప‌టేల్ గురించి ప్ర‌శంసించ‌డం విశేష‌మ‌ని అంటున్నారు.

కాగా, బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్ర‌సంగించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్ర‌ధాని నరేంద్ర మోడీని యుగపురుషుడిగా అభివర్ణించారు. అవినీతి రహిత పాలనను అందిస్తూ దేశాన్ని సాంకేతిక, ఆర్థిక, సామాజిక రంగాలలో ముందుకు నడిపిస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు