హైద‌రాబాద్ మెట్రోకు ఆధ్యుడు..చంద్ర‌బాబేకదా

హైద‌రాబాద్ మెట్రోకు ఆధ్యుడు..చంద్ర‌బాబేకదా

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైల్ సేవ‌ల ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మ‌వ‌డం...మ‌రోవైపు స్మార్ట్ కార్డుల అమ్మ‌కాల‌తో ప్ర‌యాణం కోసం హైద‌రాబాదీలు వేచి చూస్తుండ‌టం...మెట్రో సేవ‌లు అందుబాటులోకి రావ‌డం త‌మ ఘ‌న‌తే అని అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారం చేసుకుంటుండ‌టం..`అదంతా అబ‌ద్దం..అస‌లు కేసీఆర్ వ‌ల్లే మెట్రో జాప్య‌మ‌యింది...మెట్రోను ప్రారంభించింది మేం అయితే...సేవ‌లు అందించ‌డం ద్వారా మైలేజీ పొందే ప్ర‌య‌త్నం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ` అంటూ కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ల ఆధారంగా కౌంట‌ర్ ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌..ఇంకా చెప్పాలంటే....అనూహ్య‌మైన స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే హైద‌రాబాద్ మెట్రోకు ఆద్యుడు... ఉమ్మ‌డి ఏపీ సీఎం..ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని.

ఔను. ప్ర‌స్తుతం స‌ర్వం సిద్ధం అయిపోయిన మెట్రో సేవ‌ల‌కు ఆద్యుడు టీడీపీ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబు అంట‌. అప్పుడెప్పుడో...14 ఏళ్ల క్రితం బాబు త‌న విజ‌న్‌తో చేసిన ప్ర‌య‌త్నం ఫ‌ల‌మే ఇప్పు మెట్రో సేవ‌ల‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ పార్టీ క్లెయిం చేసుకుంటోంది. చంద్ర‌బాబు స‌న్నిహితుడనే పేరున్న టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రారంభం అవుతున్న  సందర్భంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రేస్‌ నాయకులు మెట్రోను తామే నిర్మించామని మైలేజీ పొందే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ...హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తీర్చడానికి మెట్రో ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు చేసిన కృషి, శ్రమను రాజకీయ నాయకులు  మర్చిపోయినా ప్రజలు మరిచిపోరని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

మెట్రో ప్రాజెక్టును మేమే నిర్మించామని ఇటు టీఆర్‌ఎస్‌, అటు కాంగ్రేస్‌ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రావుల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మెట్రో ఆలోచన-అనుమతులు-అమలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరగగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని కొనసాగించిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును ఆలస్యం చేయడం, ఆడంబరాలను మాత్రమే చేస్తోంద‌ని ఆరోపించారు. 2003 వ సంవత్సరంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు హైదరాబాద్‌కు మెట్రో కావాలని విజ్ఞ‌ప్తి  చేయగా... అదే ఏడాది అక్టోబర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌కు మెట్రో నిర్మించడానికి అంగీకరించిందని తెలిపారు. డీపీఆర్‌ను పంపమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింద‌న్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే మెట్రో ఒక కొలిక్కి వచ్చిందని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తెలుసుకుంటే మంచిదన్నారు. ఆనాడు అహ్మదాబాద్‌ ,బెంగుళూరు, హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రో రైలు తిరాగాల్సిన సెక్టార్లను కూడా గుర్తించడం జరిగిందని రావుల వివ‌రించారు. తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును కొనసాగించిందన్నారు.

మేటాస్‌ కంపెనీకి మెట్రోను అప్పచెప్పడం ఆ తరువాత ఆ కంపెనీ మెట్రో ప్రాజెక్టు నుండి తప్పుకోవడం అందరికీ తెలిసిందేన‌ని...అనంత‌రం ఎల్ఆండ్‌టీ సంస్థ‌కు ఇవ్వ‌డం ఉద్య‌మం స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీ మెట్రోను వ్య‌తిరేకించ‌డం అందరికీ తెలిసిందేన‌ని అన్నారు. `జూన్‌ 18,2011న కేసీఆర్‌ చేసిన ప్రసంగాన్ని గమనిస్తే సుల్తాన్‌ బజార్‌లో మెట్రో ప్రాజెక్టును ఎలా కడతారు? ఆ ప్రాంతం తెలంగాణ సాంస్కృతి  వారసత్వమని , అక్కడ మెట్రో ప్రాజెక్టును కట్టనీయమని మాట్లాడారు. అదేవిధంగా అసెంబ్లీ ముందర కూడా మెట్రో  ప్రాజెక్టును వద్దన్నారు. కానీ ఇప్పుడు స‌ర్వం మేమే అంటున్నారు. ఆలస్యం , ఆడంబరాలు చేయడంలో మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జోక్యం ఉందని మేము కూడా ఒపుకుంటున్నాము`` అని ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మాట‌ల‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు