మెట్రో రైలు పుణ్యం వైఎస్‌దే

మెట్రో రైలు పుణ్యం వైఎస్‌దే

సందు దొరికినప్పుడల్లా హైదరాబాద్ అభివృద్ధి ఘనత మొత్తాన్నీ తన ఖాతాలో వేసుకుంటుంటారు చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా మెట్రో రైలు ప్రారంభమవుతుండడంతో ఈ ఘనతను మొత్తంగా తమ ఖాతాలో వేసుకునేలా తెలంగాణలో పాలక టీఆరెస్ రెడీ అయిపోతుంది. కానీ... వాస్తవం చూసుకుంటే హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ను దివంగత సీఎం రాజశేఖరరెడ్డికే ఇవ్వాలి. ఆయన హయాంలోనే దీనికి పునాది రాయి పడడమే అందుకు కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఒప్పందం నాటికి హైదరాబాద్ ఇంఛార్జి మంత్రిగా ఉన్న ప్రస్తుత తెలంగాణ శాసనమండలి  విపక్ష నేత షబ్బీర్ అలీ తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్సార్‌ కేబినెట్‌లో తాను హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సమయంలో మెట్రో కోసం ఒప్పందం జరిగిందని, శంకుస్థాపన చేశామని గుర్తుచేస్తూ అప్పటి ఫొటోను కూడా ఆయన చూపిస్తున్నారు. ఆనాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కృషి చేశారని.. వైఎస్సార్‌ రోజూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు.

హైదరాబాద్ మెట్రోకు ఎప్పుడేం జరిగిందన్న టైం లైన్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.   వైయస్‌ఆర్‌ ఆహ్వానం మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు 2005–07 మధ్యకాలంలో నగరంలో పర్యటించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు.  మొదటి దశలో మూడు కారిడార్లలో మొత్తం 73 కిమీ మేర ప్రాజెక్టుకు రూపలక్పన జరిగింది. ఎల్బీనగర్‌– మియాపూర్‌(29కిమీ), జేబీఎస్‌–ఫలక్‌నుమా(15కిమీ), నాగోలు– రాయదుర్గం(29 కిమీ) మార్గాల్లో పనులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అన్ని క్లియరెన్సులను కూడా వైయస్‌ఆర్ హయాంలోనే పూర్తయ్యాయి.

2008 జూలైలో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం , టెండర్ల ప్రక్రియ చేపట్టారు. పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP mode) ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. మైటాస్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఆ తరువత ఈ సంస్థ కార్పొరేట్‌ మోసాల కేసులో చిక్కుకోవడంతో వైయస్‌ సర్కారు 2009 తొలినాళ్లలో టెండర్లు రద్దు చేసింది. తిరిగి పారదర్శక విధానంలో గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ఎల్‌అండ్‌టీ సంస్థ టెండర్లు దక్కించుకుంది.  మొత్తంగా వైఎస్ విజన్ ప్రకారమే హైదరాబాద్ మెట్రో రూపుదిద్దుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్ నేతలూ గుర్తు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు