కేసీఆర్ కు కోప‌మెందుకు వ‌చ్చిందంటే..

కేసీఆర్ కు కోప‌మెందుకు వ‌చ్చిందంటే..

యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎంత ప్రీతిపాత్ర‌మైన దేవాల‌య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మిగ‌తా రాష్ర్టాల‌కు తీసిపోని విధంగా ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ‌ను ప్ర‌ముఖంగా నిలిపేందుకు కేసీఆర్ యాద‌గిరిగుట్ట‌ను ప్ర‌త్యేకంగా యాదాద్రిగా నిర్వ‌చించి మ‌రీ అక్క‌డ పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే యాదాద్రి విష‌యంలో సీఎం కేసీఆర్ ఆశిస్తున్న‌ది ఒక‌టి అయితే...అక్క‌డ జ‌రుగుతున్న‌ది మ‌రొకటి కావ‌డంతో..గులాబీ ద‌ళ‌ప‌తికి మండిపోయింది. దీంతో స‌ద‌రు కాంట్రాక్ట‌ర్‌పై చిందులు తొక్కారు. అధికారుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం యాదాద్రి దేవాలయాన్ని దర్శించారు. తరువాత కొండపై ఆలయ విస్తరణ పనులను సీఎం సుమారు 38 నిమిషాల పాటు పరిశీలించారు. పనులపై పర్యవేక్షణ ఏదని ఎంపీ, ఎమ్మెల్యేలకు చురకలంటించారు.ఈ సంద‌ర్భంగానే కాంట్రాక్ట‌రుపై మండిప‌డ్డారు. తూర్పు రాజగోపురం నుంచి పనులు పరిశీలన చేస్తూ దక్షిణం వైపు వెళ్లారు. అక్కడ రిటైనింగ్‌ వాల్‌ అసంపూర్తిగా ఉండటం సీఎంకు కోపం తెప్పించింది. మూడు దిక్కుల్లో గోపురాల నిర్మాణాలు ప్రారంభించి దక్షిణ దిశలో ఎందుకు ప్రారంభించలేదని వైటీడీఏ ఆర్కిటెక్‌ ఆనంద్‌సాయిని ప్రశ్నించారు. దానికి, రిటైనింగ్‌ వాల్‌ పూర్తయితేనే రాజగోపురం నిర్మాణ పని ప్రారంభమ వుతుందని ఆయన సమాధానం చెప్పారు. దాంతో ఆగ్రహానికి గురైన సీఎం.. 'కాంట్రాక్టర్‌ ఎక్కడున్నాడు..? ఇక్కడికి పిలువండీ? చేతనైతే చెయ్యమ నండి. లేకుంటే మానుకోమని చెప్పండి. పనుల్లో జాప్యాన్ని సహించను' అంటూ హెచ్చరించారు.

అభివృద్ధి పనులు రాత్రింబవళ్లు చేసి సకాలంలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. `గోదావరి బ్రిడ్జి నిర్మాణం కంటే ఈ పనులు కష్టమా.! రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం మరో 20 ఏళ్ల‌ వరకు నిర్మించాలని అనుకుంటున్నారా? చేయగలిగితేనే చేయండి. చేతకాకుంటే పక్కకు జరిగితే వేరొక్కరికి పనులు అప్పగించి వేగంగా పూర్తి చేయిస్తాం. ఇలా అయితే యాదాద్రి పనులు ఎప్పటికీ పూర్తవుతాయి. పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది` అంటూ యాదాద్రి అభివృద్ధి పనులు చేస్తున్న సన్‌షైన్‌ సంస్థ కాంట్రాక్టర్‌పై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నత్తనడకన పనులు సాగితే గర్భగుడి ఆలయాన్ని మార్చిలోగా ఎలా పూర్తి చేస్తారు? బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారని వైటీడీఏ అధికారులను సీఎం ప్రశ్నించారు.

కాగా, ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ‌రాలు కురిపించారు. యాదాద్రి చుట్టూ రోడ్లను కలుపుతూ 7 జంక్షన్లతో 7 కిలోమీటర్ల మేర 6 లైన్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు చేస్తున్నట్టు  వెల్లడించారు. కొండపై టూరిజం శాఖ హరిత హోటల్లో వైటీడీఏ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. యాదగిరిగుట్టను శరవేగంగా అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు తరచూ ఇక్కడకు వస్తారని, దీనికి అనుగుణంగా100-150 మంది పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌ను యాదాద్రిలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్‌ శాఖ కార్యాలయాలు, క్వార్టర్లు నిర్మాణాలకు 50 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. యాదాద్రికి ప్రత్యేకంగా ఏసీపీ కార్యాలయం, టెంపుల్‌ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేసినట్టు ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు