తొలి బంతికే మ్యాచ్ గెలిచారు!

తొలి బంతికే మ్యాచ్ గెలిచారు!

2 ప‌రుగులు....సాధార‌ణంగా ఓ క్రికెట్ మ్యాచ్ లో 11 వ నంబ‌ర్ బ్యాట్స్ మ‌న్ అవ‌లీల‌గా సాధించే స్కోరు.....ఒక మేటి జ‌ట్టు టీ20 మ్యాచ్ లో స‌మ‌ర్పించుకునే ఎక్స్ ట్రాలు.....స‌త్తా గ‌ల బౌల‌ర్ ఒక ఓవ‌ర్ల పొదుపుగా ఇచ్చే ప‌రుగులు.....ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన‌వ‌న్నీ క్రీడా ప్రేమికులకు తెలిసిన గ‌ణాంకాలు. అయితే, ఇక‌పై వారు 2 ప‌రుగులంటే.....ఓ జట్టు సభ్యులు మొత్తం కలిపి నమోదు చేసిన స్కోరు...అని గుర్తుపెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 50 ఓవ‌ర్ల మ్యాచ్ సంద‌ర్భంగా ఓ జట్టు కేవ‌లం రెండు ప‌రుగులు సాధించి సంచ‌ల‌నం రేపడ‌మే ఇందుకు కార‌ణం. ఆ రెండు ప‌రుగుల‌లో కూడా ఒక‌టి వైడ్ రూపంలో రావ‌డం మ‌రింత దారుణ‌మైన విష‌యం. ఆంధ్రప్రదేశ్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న‌ అండర్‌-19 ఉమెన్స్‌ సూపర్‌ లీగ్ లోని ఓ మ్యాచ్ లో ఈ అరుదైన చెత్త రికార్డును నాగాలాండ్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు సాధించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం నాగాలాండ్‌-కేరళ మధ్య జ‌రిగిన‌ 50 ఓవర్ల మ్యాచ్ లో నాగాలాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నాగాలాండ్ ఓపెన‌ర్ మేన‌క ఒక పరుగు చేసింది. 5.2 ఓవర్లలో జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద నాగాలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

ఆ తర్వాత 7.4వ ఓవర్లో జట్టు స్కోరు రెండు వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ వుమన్లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టేశారు. కేరళ బౌలర్ల ధాటికి  నాగాలాండ్‌..17 ఓవర్లు ఆడి 2 పరుగులకే కుప్పకూలింది. కేరళ బౌలర్  మణి 4 మెయిడెన్లు వేసి 4 వికెట్లు తీయ‌గా, సౌరభ్య  6 మెయిడెన్లు వేసి 2 వికెట్లు తీసింది. సురెన్‌, సెబాస్టిన్ కు చెరో వికెట్‌ దక్కింది. 3 పరుగుల విజయ లక్ష్యంతో కేరళ బరిలోకి దిగింది. బౌలింగ్ లో కూడా నాగాలాండ్ త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంది. ఆ జ‌ట్టు బౌలర్‌ దీపిక తొలి బంతిని వైడ్ గా వేసింది. దీంతో, మ్యాచ్ లో వేసిన తొలి లీగ‌ల్ డెలివ‌రీని కేర‌ళ బ్యాట్స్ వుమ‌న్ అన్సు ఫోర్ గా మ‌లిచింది. మ్యాచ్ తొలిబంతికే కేరళ లక్ష్యాన్ని ఛేదించి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

క్రికెట్‌ చరిత్రలో ఒక్క బంతికే లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్‌ ఇదే అని, అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌ కూడా ఇదే అని వర్గాలు తెలిపాయి. 2006లో జ‌రిగిన ఓ మ్యాచ్ సంద‌ర్భంగా మ‌య‌న్మార్ జ‌ట్టుపై రెండు బంతుల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించి నేపాల్ నెల‌కొల్పిన రికార్డును కేర‌ళ బ‌ద్ద‌లు కొట్టింది. ఈ నెల‌లో బీసీసీఐ నిర్వ‌హించిన అండ‌ర్‌-19 వుమెన్స్ నార్త్ ఈస్ట్ చాంపియ‌న్ షిప్ లో మ‌రో ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ ఇదే త‌ర‌హాలో ఓ చెత్త రికార్డు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. మ‌ణిపూర్ బౌల‌ర్లు ఏకంగా 136 వైడ్లు విసిరి సంచ‌ల‌నం రేపారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో క్రికెట్ కు ఆద‌ర‌ణ త‌క్కువ‌గా ఉంటుంది. ఆ ప్రాంతాల‌ నుంచి అతి త‌క్కువ మంది క్రికెట్ ఆడేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే, ఈ త‌ర‌హా రికార్డులు వారిలోని ఆస‌క్తిని నీరుగార్చేలా ఉన్నాయ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు