అనేక ట్విస్టుల త‌ర్వాత‌..ఆర్కేన‌గ‌ర్‌కు ఉప ఎన్నిక‌

అనేక ట్విస్టుల త‌ర్వాత‌..ఆర్కేన‌గ‌ర్‌కు ఉప ఎన్నిక‌

పురుచ్చి తలైవి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ ఖ‌రారైంది. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ భారీ ఎత్తున డబ్బు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టడం, అవినీతి ఆరోపణల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ఉప ఎన్నికను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక రాజ‌కీయం హాట్ హాట్ గా సాగింది. అన్నాడీఎంకే అస‌లైన వార‌సురాలిగా చెప్పుకొంటున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ‌శిక‌ళ‌ త‌న మేనల్లుడు టీటీవీ దినకరన్ అధికార పక్షం నుంచి రంగంలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం తమ అభ్యర్థిగా ఇ. మధుసూదనన్‌ను ప్రకటించింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకే త‌ర‌ఫున‌ న్యాయవాది ఎన్. మరుతు గణేశ్ పోటీకి దిగారు. మ‌రోవైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం తన ‘ఎంజిఆర్ అమ్మ దీపా పరవై’ పార్టీ తరఫున బరిలోకి దిగనున్న‌ట్లు తెలిపారు. దీప భ‌ర్త మాధ‌వ‌న్ సైతం వేరే పార్టీ పెట్టి త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో దింపుతామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అయితే భారీగా డ‌బ్బుల పంపిణీ జ‌రిగింద‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఆ ఎన్నిక వాయిదా ప‌డింది.

కాగా, అక్రమాస్తుల కేసులో ఎమ్మెల్యే పదవితో పాటు ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన జయల‌లిత తిరిగి సీఎం పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కాని జయలలిత ఆరునెలల లోపు ఉప ఎన్నికలకు వెళతారా లేక ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారా అనే సందేహాలు, చర్చలు సాగాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా జయ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జయ పోటీ చేయనున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు జయలలిత తమకు చెప్పారని వారు వెల్ల‌డించారు. జూన్ 27న, 2015న‌ ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు ముందు ఆర్‌కేనగర్ శాసనసభ్యుడు, అన్నాడీఎంకే నేత వెట్రివేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించారు.

అయితే జ‌య‌లలిత అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాల‌వ‌డం, అక్క‌డే మృతి చెంద‌డంతో....ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆర్కేనగర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి అయింది. అన్నాడీఎంకేలో చీలిక రావ‌డంతో..ఆ పార్టీనేత‌లు కుంప‌ట్ల‌తో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల‌డిగా ఖ‌ర్చు చేయ‌డం..ఎన్నిక‌ వాయిదా ప‌డటంతో....తాజాగా మ‌రోమారు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు