చంద్రబాబుకు డిసెంబరు 6 డెడ్‌లైన్

చంద్రబాబుకు డిసెంబరు 6 డెడ్‌లైన్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ మరోసారి టార్గెట్ పెట్టారు. తాజాగా చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంపై ఇటీవల ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ డిసెంబరు 6 డెడ్ లైన్‌గా పెట్టారు. ఇటీవల కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా కాపులకు బీసీ రిజర్వేషన్‌ను రెండు నెలల్లో అమలుచేస్తామని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పార‌ని ... ఇచ్చిన మాట ప్రకారం వ‌చ్చే నెల‌ 6న అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆ ప్ర‌క‌టన‌ చేసి త‌మ‌కు తీపికబురు చెప్పాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఇతర బీసీలు వ్యతిరేకించేలా చంద్రబాబే ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు... కాపుల రిజర్వేషన్లలో వర్గీకరణ కూడా ఉండాలని ముద్రగడ సూచించారు.
   
కాపుల‌కు రిజర్వేషన్లు ఇస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని బీసీ నేత‌ల‌తో చంద్రబాబు నాయుడు కావాల‌నే చెప్పిస్తున్నారని ముద్ర‌గ‌డ ఆరోపించారు. భవిష్యత్తులో కాపుల విష‌యంలో ఎటువంటి గొడ‌వ‌లు రాకుండా కాపుల‌ రిజర్వేషన్‌లో ఏబీసీడీ వర్గీకరణ కూడా ఉండాలని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.
   
తాను రాసిన లేఖను చంద్రబాబు చదవాలని.. ఆయన నుంచి సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం కోసం కాపులంతా ఎదురుచూస్తున్నారని ముద్రగడ అన్నారు. మరి, దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అయితే.. ముద్రగడ లేఖ నేపథ్యంలో చంద్రబాబు మాటెలా ఉన్నా టీడీపీలో ఉన్న కాపు నేతలు మాత్రం ఇరుకునపడుతున్నారు.  చంద్రబాబు హామీని ముద్రగడ మరోసారి గుర్తు చేయడంతో ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలా అని తెగ టెన్షన్ పడుతున్నారట. కాకినాడ ఎన్నికల సందర్భంగా ఎడాపెడా హామీలిచ్చి చంద్రబాబు తమను ఇరుకునపెడుతున్నారని వారు వాపోతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు