ఏపీకి ఆ అదృష్టం ఉందా!

ఏపీకి ఆ అదృష్టం ఉందా!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అటు తెలంగాణ‌తో పాటు ఇటు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు కూడా కేంద్ర ప్ర‌భుత్వం అంత సానుకూలంగా ఉన్న నిర్ణ‌యాలైతే తీసుకుంటున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ సంగతెలా ఉన్నా... రాజ‌ధాని కూడా లేకుండా ఏర్పాటైన ఏపీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయింది. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మాదిరిగా కేంద్రం సాయం చేస్తే త‌ప్పించి ఏపీ ఇప్పుడ‌ప్పుడే కోలుకునేలా క‌నిపించ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. మ‌రి అలాంట‌ప్పుడు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల‌న్నీ వ‌స్తున్నాయా? అంటే అది కూడా లేదు. అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ట్లుగా ఏపీకి కేంద్రం సాయం చేస్తున్న దాఖ‌లా కూడా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో నిన్న కేంద్రం నుంచి ఓ భారీ ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చేసింది. అదేంటంటే... ఏపీతో పాటు తెలంగాణ‌కు కూడా ఒకే సారి గుడ్ న్యూస్ వినిపిస్తుంద‌ట‌.

అప్పుల్లో ఉన్న ఏపీకి ఇవ్వ‌డానికి లేదు గానీ... ఏపీతో పాటు తెలంగాణ‌కు క‌లిపి కూడా వినిపించ‌నున్న గుడ్ న్యూస్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రెండు రాష్ట్రాల్లో రెండు ఉక్కు క‌ర్మాగారాల‌ను కేంద్రం ప్ర‌క‌టిస్తుంద‌ట‌. అస‌లు నిన్న దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ దిశ‌గా ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీ గ‌నుల శాఖ మంత్రి సుజ‌య‌కృష్ణ రంగారావుతో పాటు తెలంగాణ పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో ఒకే ద‌ఫా భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లో కేంద్రం ఏర్పాటు చేస్తాన‌న్న ఉక్కు ఫ్యాక్టరీల‌పై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. సుదీర్ఘంగానే సాగిన ఈ చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు రాష్ట్రాల మంత్రుల‌తో పాటు బీరేంద్ర సింగ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి అక్క‌డే మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఏపీలోని క‌డ‌ప జిల్లాతో పాటు తెలంగాణ‌లోని బ‌య్యారంలోనూ ఉక్కు ఫ్యాక్టరీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, ఆ దిశ‌గా ప్ర‌స్తుతం స‌ర్వే కూడా చేయిస్తున్నామ‌ని బీరేంద్ర సింగ్ తెలిపారు. కేవ‌లం ఒక్క నెల వ్య‌వ‌ధిలోనే దీనికి సంబంధించిన నివేదిక వ‌స్తుంద‌ని, ఆ నివేదిక రాగానే... రెండు తెలుగు రాష్ట్రాల‌కు గుడ్ న్యూస్ చెబుతామంటూ ఆయ‌న వెల్ల‌డించారు. బ‌య్యారంలో అపార‌మైన ఇనుప ఖ‌నిజం ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే ఆ ఖ‌నిజం మీదే ఆధార‌ప‌డి అక్క‌డ ఉక్కు ఫ్యాక్టరీ పెడితే... అదేమంత లాభ‌దాయ‌కం కాద‌ని సాక్షాత్తు కేంద్ర‌మే గ‌తంలో ప్ర‌క‌టించింది. బ‌య్యారంలో ఉన్న‌దంతా నాసిర‌కం ఖ‌నిజ‌మ‌ని, ఈ ఖ‌నిజంతో అక్క‌డ లాభ‌దాయ‌క‌మైన ఉక్కు త‌యారీ సాధ్యం కాద‌ని కూడా కేంద్ర తెలిపిన విష‌యం తెలిసిందే. మ‌రి అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కొత్త‌గా ఉక్కు ఫ్యాక్ట‌రీ క‌ట్టేస్తామంటూ కేంద్ర ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే... ఈ ప్ర‌కట‌న ఎంత‌మేర‌కు వాస్త‌వ‌మ‌నే విష‌యం ఇట్టే తేలిపోతుంది.

ఇక క‌డ‌ప జిల్లా విష‌యానికి వ‌స్తే... దివంగత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో క‌డ‌ప జిల్లాలో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు సంబంధించి చాలా వేగంగా అడుగులు ప‌డ్డాయి. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న క‌ర్ణాట‌క స‌ర్కారులో నాడు మంత్రిగా ఉన్న గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి నాడు బ్ర‌హ్మ‌ణి స్టీల్స్ పేరిట ఉక్కు క‌ర్మాగారానికి శంకుస్థాప‌న కూడా చేసి పారేశారు. ఆ త‌ర్వాత వైఎస్ చ‌నిపోవ‌డం, ఉక్కు ఫ్యాక్టరీ అట‌కెక్క‌డం తెలిసిందే. అయితే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారు పాల‌న మొద‌లెట్టి ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు దాటుతోంది. అయినా ఇప్ప‌టిదాకా అక్క‌డ ఉక్కు ఫ్యాక్ట‌రీకి సంబంధించి సింగిల్ స్టెప్ కూడా ప‌డ‌లేదు. అంతేకాకుండా అక్క‌డ ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల‌ని ఆ జిల్లాకు చెందిన ప‌లువురు రోజుల త‌ర‌బ‌డి దీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ఏపీకి కేంద్రం చేయూత‌ను చూస్తుంటే... అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల దాకా ఇంకే త‌ర‌హా సాయం కూడా కేంద్రం నుంచి అందే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో ఏపీతో పాటు తెలంగాణ‌కు కూడా గుడ్ న్యూస్ చెబుతామ‌న్న బీరేంద్ర సింగ్ మాట‌ల్లో ఇసుమంత నిజ‌మైనా ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు