అమ‌రావ‌తి జ‌న‌సేన ఆఫీసు- అది లీజా? ప‌వ‌న్ సొంత‌మా?

అమ‌రావ‌తి జ‌న‌సేన ఆఫీసు- అది లీజా? ప‌వ‌న్ సొంత‌మా?

వచ్చేస్తున్నా.. నేనొచ్చేస్తున్నా అంటూ త‌ర‌చూ మాట‌లు చెప్ప‌ట‌మే కానీ చేత‌ల్లో చేసి చూపించ‌ని నేత‌గా మారారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సినిమా.. రాజ‌కీయం అనే రెండు ప‌డ‌వ‌ల మీద కాలు పెట్టి జ‌ర్నీ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సెప్టెంబ‌రు నుంచి పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి తాను వ‌చ్చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

కానీ.. సెప్టంబ‌రు పూర్తి అయి.. రెండు నెల‌లు అయిపోతోంది. కానీ.. క్రియాశీల రాజ‌కీయాల‌కు ఇంకా దూరంగానే ఉన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌ళుక్కున మెరిసే ఆయ‌న‌.. ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి చాలాకాల‌మే అయ్యింది.

మ‌రోప‌క్క పార్టీ అంత‌ర్గ‌త నిర్మాణానికి సంబందించిన  ప్రెస్ నోట్లు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ప‌వ‌న్ స్పందించింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌జ‌ల్లోకి త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని భావిస్తున్న ప‌వ‌న్‌.. ముందుగా ఏపీలో త‌న పార్టీ ఆఫీసు స్టార్ట్ చేయ‌టానికి సిద్ధమ‌య్యార‌ని చెబుతున్నారు.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో తాను చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప‌వ‌న్‌.. ఈ నెలాఖ‌రు నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తార‌ని చెబుతున్నారు. మ‌ధ్య‌లో నెల గ్యాప్ తీసుకొని ఆ వెంట‌నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తార‌ని.. ఇందుకు త‌గ్గ‌ట్లుగా ప‌క్కా షెడ్యూల్‌ను సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఏపీ నుంచి పార్టీని న‌డిపేందుకు వీలుగా.. ఏపీరాజ‌ధాని అమ‌రావ‌తికి కాస్త ద‌గ్గ‌ర్లో చిన‌కాకాని వ‌ద్ద కొంత స్థ‌లాన్ని లీజుకు తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న ప‌వ‌న్  అందుకు త‌గ్గ‌ట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయ‌టం.
హైద‌రాబాద్ నుంచిపార్టీని న‌డ‌ప‌టం స‌రికాద‌ని.. సెంటిమెంట్ ప‌రంగా ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకోలేద‌న్న ఆలోచ‌న‌తో ఏపీలో ఒక కార్యాల‌యం.. హైద‌రాబాద్ లో మ‌రో కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌న్న విష‌యంపై ప‌వ‌న్ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ప్ర‌శాస‌న్ న‌గ‌ర్ లోని పార్టీ కార్యాల‌యం నుంచి పార్టీ కార్య‌క‌లాపాల్ని సాగిస్తున్న ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర‌గా ఉన్న చిన‌కాకానిలో రెండున్న‌ర ఎక‌రాల్నిలీజుకు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.  మ‌రోవైపు.. రెండున్న‌ర ఎక‌రాల్ని కొనుగోలు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌నా లేన‌ప్ప‌టికీ చిన‌కాకాని ద‌గ్గ‌ర స్థ‌లాన్ని తీసుకొని పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయ‌టంలో మాత్రం క‌రెక్ట్ అని చెబుతున్నారు.

ఎక‌రాకు ఏడాదికి రూ.50వేలు చొప్పున మూడేళ్ల‌కు భూమిని లీజుకు తీసుకున్న‌ట్లుగా కొంద‌రు రైతులు చెబుతున్నారు.  చూస్తుంటే.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి  జ‌న‌సేన అధినేత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.  సోష‌ల్ మీడియాకు మాత్ర‌మే ప‌వ‌న్ ప‌రిమితమ‌న్న విమ‌ర్శ స్థానంలో.. ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్ అనే దిశ‌గా అడుగులు ప‌డ‌నున్నాయ‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు