టీడీపీ గూటికి మ‌రో వైసీపీ ఎమ్మెల్యే ఖాయ‌మేనా?

టీడీపీ గూటికి మ‌రో వైసీపీ ఎమ్మెల్యే ఖాయ‌మేనా?

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇప్పుడు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారం చేజిక్కించుకోలేక పోయిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేప‌ట్టాల్సిందేనన్న క‌సితో ముందుకు సాగుతున్నారు. అయితే భ‌విష్యత్తు రాజ‌కీయాల‌పై కాస్తంత ముందు చూపుతో ఆలోచించిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... జ‌గ‌న్‌ను అలాగే ఉంచేస్తే ఇబ్బందేన‌ని త‌ల‌చారో, ఏమో తెలియ‌దు గానీ... ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర తీశారు. విడ‌త‌ల‌వారీగా సాగిన పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఇప్ప‌టికే 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప‌య్యారు. ఈ త‌ర‌హా వ్యూహాల్లో చంద్ర‌బాబు ఎత్తుల‌కు త‌గ్గ‌ట్లుగా జ‌గ‌న్ పై ఎత్తులు వేయ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న పార్టీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని, దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి లాంటి అత్యంత స‌న్నిహితుల‌ను కూడా పార్టీ మార‌కుండా జ‌గ‌న్ ఆపుకోలేక‌పోయార‌నే వాద‌న కూడా లేక‌పోలేదు.

అప్పుడెప్పుడో ప్రారంభ‌మైన పార్టీ ఫిరాయింపులు ఇంకా కొన‌సాగే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌కు చెందిన వైసీపీ మ‌హిళా నేత‌, పాడేరు నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా ఇప్పుడు పార్టీ మారే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన ఈశ్వ‌రి... త‌న అసంతృప్తిని పార్టీ అధినేత వ‌ద్ద‌కు చేర‌వేశార‌ట‌. అయితే అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌క‌పోవ‌డంతో పార్టీ మారే విష‌యంపై చాలా వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌న ముఖ్య అనుచ‌రుల‌తో భేటీ అయిన ఈశ్వ‌రి... పార్టీ మార్పుపై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. రేపు, ఎల్లుండి కూడా ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌తోనూ స‌మావేశం కానున్నార‌ట‌. ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌మాలోచ‌నల్లో మెజారిటీ మంది అనుచ‌రులు పార్టీని వీడుదామ‌నే ఆమెకు చెప్పార‌ట‌. అంతేకాకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి పొరుగున ఉన్న అర‌కు నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నేత‌ను కూడా ఆమె టీడీపీలోకి తీసుకుని వెళ్లే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

ఇదే జ‌రిగితే... విశాఖ జిల్లాలో వైసీపీ పెద్ద ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టేన‌ని భావించ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... పార్టీలో సీనియ‌ర్ నేత‌గానే కాకుండా మంచి వాగ్దాటి క‌లిగిన నేత‌గా, ఏ అంశంపై అయినా విస్ప‌ష్టంగా అధికార ప‌క్షంపై ఎదురు దాడి చేయ‌గ‌లిగిన నేత‌గా ఈశ్వ‌రికి మంచి పేరే ఉంది. అంతేకాకుండా... వైసీపీకి ఆమె మంచి ఆయుధం కూడానూ. విశాఖ మ‌న్యంలో ఖ‌నిజాల త‌వ్వ‌కానికి సంబంధించి ప్ర‌భుత్వాన్ని నిలువ‌రించ‌డంలో ఈశ్వ‌రి త‌న‌దైన శైలిలో పోరాటం చేసి విజ‌యం సాధించారు కూడా. ఈశ్వ‌రి విజ‌యం నాడు వైసీపీ ఖాతాలో ప‌డిపోగా... పార్టీలో ఆమెకు మంచి హోదా ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే అర‌కు ఎమ్మెల్యేగా ఉన్న స‌ర్వేశ్వ‌ర‌రావు పార్టీ మారిన త‌ర్వాత అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీగా ఓ యువ నేత‌ను ఈశ్వ‌రి త‌యారు చేశారు.

అయితే ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాల‌తో పార్టీ స‌స్పెండ్ చేసిన ఓ నేత‌ను మ‌ళ్లీ స్వాగ‌తం ప‌ల‌క‌డ‌మే కాకుండా.. ఆయ‌న‌కే పార్టీ నియోజక‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైంద‌ట‌. ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తే.. ఆయ‌న నుంచి స‌రైన స‌మాధాన‌మే రాలేద‌ట‌. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఈశ్వ‌రి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న లేదంటే 28న ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా దాదాపుగా అన్ని ఏర్పాట్లు జ‌రిగిపోయాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌కు పెద్ద దెబ్బ త‌గిలిన‌ట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు