ఈడీ బ్లాక్ లిస్ట్‌లో జ‌గ‌న్ పేరూ ఉందే!

ఈడీ బ్లాక్ లిస్ట్‌లో జ‌గ‌న్ పేరూ ఉందే!

వైసీపీ అధినేత‌, ఏపీలో విప‌క్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే అధికారానికి కూత వేటు దూరంలో ఆగిపోయిన జ‌గ‌న్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిందున‌న్న క‌సితో ముందుకు సాగుతున్నారు. ఇందుకోస‌మే ఆయ‌న ఏకంగా ఆరునెల‌ల పాటు సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం కూడా చుట్టారు. 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగా కాలి బాట‌న న‌డ‌వ‌నున్న జ‌గ‌న్ ఏపీలోని 13 జిల్లాల‌నూ ట‌చ్ చేస్తూ వీల‌యిన‌న్ని ఎక్కువ నియోజక‌వ‌ర్గాల‌ను చుట్టేస్తూ శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర‌ను ముగించ‌నున్నారు. ఈ యాత్ర‌కు ముందు త‌న‌పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ‌ను చేపట్టిన నాంప‌ల్లి సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఆయ‌న‌కు పెద్ద షాకే ఇచ్చింద‌ని చెప్పాలి.

జ‌గ‌న్‌పై న‌మోదైన కేసుల‌న్నింటినీ వ‌రుస‌గా విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ప్ర‌తి శుక్ర‌వారం ఆ కేసుల‌పై విచార‌ణ‌ను నిర్వ‌హిస్తోంది. ఈ విచార‌ణ‌కు నిందితులంతా కూడా కోర్టుకు హాజ‌రుకావాల్సిందేనన్న ఆదేశాల‌తో ప్ర‌తి శుక్ర‌వారం జ‌గ‌న్ ఎక్క‌డున్నా.. నాంప‌ల్లి కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. అయితే పాద‌యాత్ర చేస్తున్న త‌న‌కు వ్య‌క్తిగత హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ చేసిన అభ్య‌ర్థన‌ను కోర్టు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అయితే అప్ప‌టికే పాద‌యాత్ర‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌న్‌.. కోర్టు నుంచి ఊర‌ట ల‌భించ‌కున్నా కూడా పాద‌యాత్ర చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. వారంలో ఆరు రోజుల పాటు పాద‌యాత్ర చేస్తూ ప్ర‌తి గురువారం రాత్రి హైద‌రాబాదు వ‌స్తున్న జ‌గ‌న్.. శుక్రవారం కోర్టు విచార‌ణ‌ను చూసుకుని అదే రోజు రాత్రి పాద‌యాత్ర‌కు వెళ్లిపోతున్నారు.

ఇంత‌టి ఇబ్బందిలోనూ మొక్క‌వోని ధైర్యంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌కు మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి. ఆ దెబ్బ కొట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్‌రేట్‌(ఈడీ). సీబీఐతో పాటు ఈడీ కూడా జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే ఈ క్ర‌మంలో బ్లాక్ లిస్ట్ పేరిట ఈడీ ఓ జాబితాను విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నును ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఎగ్గొడుతూ.. త‌మ సంప‌ద‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచుకునేందుకు ప‌లువురు షెల్ కంపెనీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో వ్యాపార‌వేత్త‌ల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. ఇలాంటి వారి జాబితాను బ‌య‌ట‌కు తీసిన ఈడీ... దానికి బ్లాక్ లిస్ట్ అని పేరు పెట్టి విడుద‌ల చేసేసింది. ఈ జబితాలో జ‌గ‌న్ పేరు కూడా ఉంది.

ఈ లిస్ట్ ప్ర‌కారం మొత్తం 31 షెల్ కంపెనీల‌ను ఏర్పాటు చేసిన జ‌గ‌న్‌... రూ.368 కోట్ల మేర అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డ్డారు. ఇంతేకాదండోయ్ ఈ జాబితాలో మొత్తం 12 మంది పేర్లుండ‌గా... జ‌గ‌న్ ప‌దో ప్లేసులో నిలిచారు. అంతేనా... ఈ జాబితాలో ఉన్న రాజ‌కీయ నేత‌ల్లో జ‌గ‌న్‌దే టాప్ ప్లేస్‌. జాబితాలో ఉన్న‌ది ఇద్ద‌రే రాజ‌కీయ నేతలు. వారిలో ఒక‌రు జ‌గ‌న్ కాగా.. ఇంకొకాయ‌న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చ‌గ‌న్ భుజ‌భ‌ల్‌. సీఎంగా ప‌నిచేసిన వ్య‌క్తి సంపాద‌న‌నే మించిపోయిన జ‌గ‌న్‌... భుజ‌భ‌ల్‌ను దాటేసి ఈడీ బ్లాక్ లిస్ట్‌లో ముందు స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. పాద‌యాత్ర వేళ ఈడీ బ‌య‌ట‌పెట్టిన ఈ బ్లాక్ లిస్ట్... జ‌గ‌న్‌కు నిజంగానే ఇబ్బంది పెట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు