ఆ అమ్మాయి కోసం హైదరాబాద్‌లో కర్ఫ్యూ

ఆ అమ్మాయి కోసం హైదరాబాద్‌లో కర్ఫ్యూ

మరో వారం రోజుల్లో హైదరాబాద్‌ను పావనం చేయబోతున్న శ్రీమాన్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వారి గారాలపట్టి ఇవాంకా సుందరి కోసం తెలంగాణ ప్రభుత్వంవారి ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న హడావుడితో పాపం అమాయక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదో అమ్మాయిగారు వచ్చే ఆ గంటో, అరగంటో అయిత అడ్జస్ట్ అయిపోతాం కానీ నాల్రోజుల ముందు నుంచే తలుపులు బిడాయించుకుని ఇంట్లో కూర్చోమంటే ఎలా అని ప్రశ్నించాలనుకుని నోటికి అరచేతిని అడ్డంపెట్టుకుని మౌనం దాల్చుతున్నారు.

అంతేకాదు... అంతకుముందు మన రాష్ఱ్టపతులు, ప్రధానులు... ఇతర దేశాల అధ్యక్షులు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంత నిర్బంధం చేశారా అని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాంకా ఏమీ అమెరికా అధ్యక్షురాలు కాదు.. అయినా, ఆమె వస్తుండడంతో ఇలా కర్ఫ్యూ పెట్టినట్లుగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇవాంకా పర్యటనపై జనం ఇంతగా చర్చించుకోవడానికి కారణం ఉంది. ఇవాంకా పర్యటన సందర్భంగా భద్రత పేరిట చేస్తున్న హడావుడి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నచిన్నవ్యాపారులు తమకు పోలీసుల నుంచి అందిన ఆదేశాలు విని కంగారు పడుతున్నారు. ఇవాంకా పర్యటన మార్గంలో ఉన్న చిరు వ్యాపారులు ఇవాంకా రావడానికి నాల్రోజుల ముందు నుంచి దుకాణాలు తీయడానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలిచ్చారట. దీంతో... ఏ పూటకాపూట సంపాదించే డబ్బుతో గడిపే తాము ఆ నాల్రోజులు పస్తులుండాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.

మాధాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులో ఉన్న వెస్ట్‌ఇన్ హోటల్‌లో ఇవాంకాకు బస ఏర్పాటు చేశారు. ఇక ఫలక్‌నుమా ప్యాలస్‌లో మోదీకి, ఇవాంకాకు విందు ఇస్తారు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లోనూ పోలీసుల హడావుడి అప్పుడే మొదలైపోయింది. చుట్టుపక్కల సుమారు కిలోమీటరు రేడియస్‌లో ప్రతి ఇంట్లో ఉన్నవారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు తీసుకుంటున్నారట. అంతేకాదు... వారి ఇల్లకు రీసెంటుగా వచ్చిన బంధువుల వివరాలూ ఆరా తీస్తున్నారట. ఇవాంకా వస్తున్న 28వ తేదీ సహా అంతకుముందు మూడు రోజుల నుంచే ఆంక్షలుంటాయని చెబుతున్నారట. తప్పనిసరైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని కూడా హెచ్చరిస్తున్నారట.

ఇక రహేజా ఐటీ పార్కులో అయితే ఆ ఆంక్షల గురించి చెప్పనవసరం లేదు. అక్కడున్న ఆఫీసులకు వచ్చే ప్రతి కారు, బైకు నంబరు, వారి వివరాలు రికార్డు చేసుకుంటున్నారు. అక్కడ ఏ కంపెనీలోనూ కొత్తగా ఎవరినీ ప్రస్తుతానికి రిక్రూట్ చేసుకోకూడదని రూల్ పెట్టారు. అక్కడ ఏ బిల్డింగులోనూ చిన్న పాటి మరమ్మతులు కూడా చేయకూడదు.. చేసినా, ఆ సంగతి పోలీసులకు చెప్పాలి. ఎవరు వచ్చి చేస్తున్నారో డీటెయిల్స్ ఇవ్వాలి.  ఇదంతా చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఇక్కడే ఉండే తమను ఇబ్బంది పెట్టేలా ఇలాంటివారిని ఎందుకు తేవడమని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇవాంకాకు అమెరికాలో ఇంత భద్రత కల్పిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English