రేవంత్ రాజీనామాపై భారీ స‌స్పెన్స్‌

రేవంత్ రాజీనామాపై భారీ స‌స్పెన్స్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ మాజీ నేత , కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.  ఇటీవ‌ల ఆయ‌న టీడీపీకి బై చెప్పి.., రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే, టీడీపీకి, ఆపార్టీ  ద్వారా ల‌భించిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రేవంత్ రాజీనామా చేశారు. దీంతో ఆయ‌న రాజీనామా చేసిన కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో ఆరు మాసాల్లో ఉప ఎన్నిక త‌థ్య‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలో అధికార టీఆర్ ఎస్ కూడా ఎట్టి ప‌రిస్థితిలోనూ రేవంత్ ను మ‌ట్టి క‌రిపించ‌డం ద్వారా టీఆర్ ఎస్ ఆధిప‌త్యాన్ని చాటాల‌ని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గం రూపు రేఖ‌లు మార్చేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు.  ఈ బాధ్య‌త‌ను కేసీఆర్ త‌న మేన‌ల్లుడు మంత్రి హ‌రీష్‌రావుకు అప్ప‌గించారు. ఉప ఎన్నిక ఎప్పుడు వ‌చ్చినా గెలిచేలా ప్లాన్ సిద్ధం చేయాల‌ని, కొడంగ‌ల్‌లో రోడ్లు మెరిసిపోవాల‌ని, ప్రాజెక్టులు పెండింగ్ అనే మాట లేకుండా పూర్తికావాల‌ని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన హ‌రీశ్ రావు.. కొడంగ‌ల్‌పై అప్పుడే దృష్టి పెట్టారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు. దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆదేశించారు. ప్రాథ‌మిక వైద్యాన్ని పూర్తిగా అందించాల‌న్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఓ విష‌యం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. రేవంత్ రాజీనామా విష‌యంలో స‌స్పెన్స్ ఉంద‌నేది నేత‌ల వ్యాఖ్య‌ల ప‌ర‌మార్థం. అంటే, రేవంత్ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికైతే రాజీనామా చేసిన మాట నిజ‌మే అయినా.. దానిని ఆయ‌న డైరెక్టుగా అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి ఇవ్వ‌కుండా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అందించార‌ని, ఇప్పుడు రాజీనామా ప‌త్రం బాబు ద‌గ్గ‌రే ఉండిపోయింద‌ని వారు అంటున్నారు. అధికారికంగా ఈ రాజీనామా ప‌త్రం స్పీక‌ర్‌కు చేరాల‌ని, అప్పుడు ఆయ‌న దానిని అంగీక‌రించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపుతార‌ని, అప్పుడు దానిని ప‌రిశీల‌న అనంత‌రం ఉప పోరు వ‌స్తుంద‌ని, అయితే, ప్ర‌స్తుతం రేవంత్ చేసిన రాజీనామా బాబు ద‌గ్గ‌రే ఉండిపోయిన నేప‌థ్యంలో ఉప పోరు ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. సో.. ఏదేమైనా.. రేవంత్ రాజీనామాలో ఇలా భారీ స‌స్పెన్స్ నెల‌కొన‌డం, ఇది కావాల‌నే ఇలా చేశార‌ని  వ్యాఖ్య‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.