భాష గురించి ఉప‌రాష్ట్ర‌ప‌తి క్లాస్ అదిరిందే!

భాష గురించి ఉప‌రాష్ట్ర‌ప‌తి క్లాస్ అదిరిందే!

నెల్లూరు జిల్లాకు చెందిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు తెలుగు భాష అన్నా, తెలుగు వ్య‌క్తులు అన్నా.. తెలుగు వంట‌కాల‌న్నా.. అమిత‌మైన ఇష్టం. ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందు రాజ‌కీయ‌నేత‌గా ఉన్న స‌య‌మంలో చేసిన ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే.. తెలుగు భాష‌పై ఆయ‌నకున్న మ‌క్కువ ఏమిటో తెలుస్తుంది. ఇటీవ‌ల త‌ర‌చుగా ఆయ‌న ఏదో ఒక కార్యక్ర‌మంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ‌ల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఏ ప‌ర్య‌ట‌న‌లోనైనా ఆయ‌న నోటి వెంట ప్రాస‌లు జాలువారుతూనే ఉన్నాయి. ఆయ‌న తెలుగు ప్రసంగాల హోరు, జోరు కొన‌సాగుతూనే ఉంది.

మాతృభాష విష‌యంలో ప్ర‌తి పౌరుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మ‌మ్మీ, డాడాల ప్లేస్‌లో అమ్మ‌, నాన్న‌ల‌ను చేర్చాల‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకొస్తారు. మాతృ భాష‌కు ఉన్న గొప్ప‌దనం అంతా ఇంతా కాద‌ని కూడా వెంక‌య్య అంటారు. అయితే తాజాగా ఆయ‌న జాతీయ భాష అయిన హిందీపైనా మ‌క్కువ చాటుకోవ‌డం విశేషం.  దేశంలో ప్రతి పౌరుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.  హైద‌రాబాద్‌లోని అమీర్ పేటలో ఆదివారం జ‌రిగిన‌ దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాష నేర్చుకోవాలని.. మాట్లాడాలని సూచించారు. తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోవద్దని  విజ్ఞప్తి చేశారు.  దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతారని.. అర్థం చేసుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెంకయ్య స్పష్టం చేశారు.

1935లో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపితమైందని, దీని ద్వారా అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని తెలిపారు. హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. మాతృభాష ఎంత మ‌ధుర‌మో.. జాతీయ భాష కూడా అంతే అవ‌స‌ర‌మ‌ని వెంక‌య్య పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌దినిముషాల పాటు హిందీలో అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.