బాబు అవాక్క‌య్యే నిర్ణ‌యం..శిల్పా ఘాటు స్పంద‌న‌

బాబు అవాక్క‌య్యే నిర్ణ‌యం..శిల్పా ఘాటు స్పంద‌న‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు సార‌థ్యంలోని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారుతోంది. శాంతిభ‌ద్ర‌త‌ల కోణంలోనే తాము ముంద‌డుగు వేశామని స‌ర్కారు చెప్తుండ‌గా...కక్ష సాధింపు దోర‌ణిలోనే ప‌రిణామాలు ఉన్నాయ‌ని విప‌క్షం వాదిస్తోంది. ఇదంతా గ‌న్‌మెన్ల ఉప‌సంహ‌ర‌ణ గురించి. ఏపీ స‌ర్కారు తాజాగా కొంద‌రు తాజా, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు భ‌ద్ర‌తా సిబ్బందిని ఉప‌సంహ‌రించుకుంది. ఇందులో హాట్ హాట్ రాజ‌కీయాల‌కు వేదిక అయిన క‌ర్నూల్ ఉంది. దీంతో స‌హ‌జంగానే....రాజ‌కీయ వేడి రాజుకుంది.

శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌ను ప‌రిశీలించిన ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ త‌ర‌ఫున ఇటీవ‌ల గెలిచిన‌ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన‌ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ గ‌న్‌మెన్ల ఉప‌సంహ‌ర‌ణ‌పై శిల్పా బ్ర‌ద‌ర్స్ స‌హా వైసీపీ నేత‌లు గుర్రుమ‌న్నారు. ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ చ‌ర్య‌కు పాల్ప‌డింద‌ని ఆక్షేపించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆక్షేపించారు.

కాగా,  కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుందని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై స్పందిస్తూ వైసీపీ నేతలు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన, మాజీ జడ్పీ చైర్మన్‌ నాగిరెడ్డి గన్‌మెన్లను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షనేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి హితవు పలికారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే విప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ చంద్ర‌బాబు సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మండిప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు