క‌విత కోరింది..కేటీఆర్ 150 కోట్లు ఇచ్చాడు...అందుకే

క‌విత కోరింది..కేటీఆర్ 150 కోట్లు ఇచ్చాడు...అందుకే

తెలంగాణ ప్ర‌భుత్వంలో వెలువ‌డుతున్న‌ ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యాల ప‌రంప‌ర‌లో మ‌రో ప‌రిణామం ఇది. చాలా మంది ప్ర‌జా ప్ర‌తినిధులు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చోట చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి మొర్రో అని మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ...వాటిని లైట్ తీసుకునే పాల‌కులు త‌మవాళ్లు అనుకుంటే ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలిసేందుకు ఇదే నిద‌ర్శ‌నం. వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే...వ‌రుస‌లో ఎక్క‌డ ఉన్నా భారీ ప్రాధాన్యం ద‌క్కుతుంద‌న్న‌ట్లుగా...తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు కార‌ణం అయింది ఎవ‌రో కాదు..ఆయ‌న సోద‌రి అయిన‌ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...ప‌లు మున్సిపాలిటీల్లోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మంత్రి కేటీఆర్‌ను ఎంపీ క‌విత క‌లిశారు. ప‌లు అంశాలు ఏక‌రువు పెట్టి నిధులు కావాల‌ని విన్న‌వించారు. దీంతో కేటీఆర్ వెంట‌నే రూ.150 కోట్లు ఇటీవ‌ల‌ మంజూరు చేశారు. దీంతో జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ ప‌ల్లి మున్సిపాలిటీల ద‌శ మారేందుకు ఎంపీ క‌విత నిర్ణ‌యం తీసుకున్నారు. పురపాలక  శాఖ మంత్రి కే తారకరామారావు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల సమన్వయ సమావేశం జరిగింది.

తాజా స‌మావేశంలోని నిర్ణ‌యం ప్ర‌కారం...మున్సిపల్  ఆఫీసులు ఈ-ఆఫీసులుగా మారనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యం కూడా సిద్ధంకానుంది. టాయిలెట్స్ అవసరమున్న చోట ఏర్పాటుచేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తారు. మినీ టాంక్ బండ్లు, పార్కులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఈ లైబ్రరీలు, బస్ షెల్టర్లు, మహిళా క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్ల కోసం ప్రత్యేక ప్రాంగణాలు నిర్మిస్తారు. టౌన్లలోని ప్రధాన రోడ్లనుఅభివృద్ధి చేస్తారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీల సుందరీకరణ లక్ష్యంగా స్పెషల్ ఫండ్‌ను వినియోగిస్తారు. ఇదంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ...ఈ మూడు మున్సిపాలిటీలు ఏం పుణ్యం చేసుకున్నాయి....మిగ‌తావా ఏం పాపం చేశాయో అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారి లాజిక్‌లో కూడా నిజం ఉంది క‌దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు